వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జరుగుతున్న రచ్చ విషయంలో ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఓ చేయి వేస్తున్నారు. తాను ఆధారిలిస్తానని.. తన వద్ద కావాల్సినంత సమాచారం ఉందని ఆయన సీబీఐకి పదే పదే లేఖలు రాస్తున్నారు. స్పందన లేకపోవడంతో.. అధికారికంగా లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడీ విషయం హైలెట్ అవుతోంది. ఎందుకంటే… ఏబీ వెంకటేశ్వరరావు .. వివేకా హత్య జరిగినప్పుడు.. ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. ఆ కేసు మొత్తం ఆయనే డీల్ చేశారు. వివేకా హత్య తర్వాత హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లిన జగన్.. నిఘా చీఫ్.. దర్యాప్తు అధికారులకు పది సార్లు ఫోన్లు చేశారని కూడా ఆరోపించారు. ఆ కేసు విషయంలో యాక్టివ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును తర్వాత ప్రభుత్వం పక్కన పెట్టేసింది. సస్పెండ్ చేసిది. ఇప్పుడు తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పడానికి ఏబీ రెడీ అయిపోయారు.
ఉగాది రోజు సీబీఐకి లేఖ రాసిన ఏబీ వెంకటేశ్వరరావ.ు. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తు లో పురోగతి లేదని… ఈ మర్డర్ ఘటనకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉన్నదని ఇస్తానని లేఖ రాశారు. సీబీఐ నుంచి స్పందన లేకపోవడంతో ఆయన దర్యాప్తు అధికారి ఎన్. కే సింగ్ కు నేరుగా ఫోన్ చేసి చెప్పారు. అయినా స్పందన లేకపోవడంతో.. ఆయన మీడియా ద్వారా సీబీఐ తీరును హైలెట్ చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వివేకా హత్యను గుండెపోటు, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనడానికి తన వద్ద పక్కా సాక్ష్యాలు ఉన్నాయని ఏబీవీ చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
హత్య జరిగిన వెంటనే… ఇంటలిజెన్స్ సిబ్బంది.. అక్కడ ఆధారాలన్నింటినీ సమీకరించారు. వాటిని దర్యాప్తు బృందానికి నిఘా చీఫ్ అందించారు. అయితే.. ప్రభుత్వం మారిన తర్వాత దర్యాప్తు బృందాలను మార్చేశారు. తర్వాత సీబీఐకి ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. తనను ప్రభుత్వం టార్గెట్ చేసినందున…తాను కూడా ఒక అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే స్వయంగా డీజీపీ తనపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ.. సీబీఐ విచారణ కోసం సీఎస్‌కు లేఖ రాశారు. స్పందించకపోతే కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వివేకా కేసులోనూ కొత్త విషయాలు బయట పెడతానని చెబుతున్నారు.