ఐదేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. తన సస్పెన్షన్ పై ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ పూర్తయింది. మంగళవారం తీర్పు రానుంది. ఆయన తప్పు చేశారన్నదానికి ఒక్క సాక్ష్యం కూడా ఇప్పటి వరకూ వైసీపీ సర్కార్ సమర్పించలేకపోయింది. ఈ కారణంగా ఆయన సస్పెన్షన్ ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ సమర్థించే అవకాశం లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఐపీఎస్లలో ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సీనియర్. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కన్నా పది మంది ఐపీఎస్ అధికారులు సీనియర్లుగా ఉన్నా వారికి అవకాశం ఇవ్వలేదు. పైగా ఆయన ఇంచార్జ్ డీజీపీనే. ప్రొసీజర్ ఫాలో కాకుండానే ఆయనను ఇంచార్జ్ గా డీజీపీగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఆయన తీరుపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన బదిలీ ఖాయమని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేస్తే ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. డీజీపీని బదిలీ చేస్తే.. ఆయనే మొదటి స్థానంలో ఉంటారు. ఈసీ పూర్తిగా సీనియార్టీ..సమర్థతను మాత్రమే చూస్తుంది కాబట్టి.. ఆయన నియామకం ఖాయమే అనుకోవచ్చు. అదే జరిగితే… వైసీపీ..దేవుడి స్క్రిప్ట్ అనుకుని… సర్దుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.