హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన ఐదవ నిందితుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఆయనను ముందు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యపరీక్షలు జరిపించి తర్వాత ఏసీబీ కోర్టుముందు హాజరు పరిచారు. ఈనెల 21వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తర్వాత ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టువద్ద మీడియాతో మాట్లాడిన సండ్ర, ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను అన్నింటికీ సమాధానాలిచ్చానని చెప్పారు. తానుకూడా ఏసీబీవారిని కొన్ని ప్రశ్నలు అడిగానని తెలిపారు. టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తూ ఆ పార్టీ నేతలనుంచి తమపార్టీ నేతలకొచ్చిన కాల్ డేటాపైకూడా విచారణ జరపాలని అడిగానని చెప్పారు. తమపార్టీలో 15మంది ఎమ్మెల్యేలు ఉండగా ఆ సంఖ్య 10కి ఎలా చేరిందీ, టీఆర్ఎస్ పార్టీలో 63 ఎమ్మెల్యేలు 82 ఎలా పెరిగిందీ అనేదానిపైకూడా విచారణ జరపాలని అడిగినట్లు వెల్లడించారు. మరోవైపు సండ్ర బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో 13న విచారణకు రానుందని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.