వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. నెల్లూరు కేంద్రంగా సాగిన బెట్టింగ్ రాకెట్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచిందని.. పోలీసులకు ఆధారాలు లభించాయి. నెల్లూరుకు చెందిన కృష్ణసింగ్ అనే వ్యక్తి బెట్టింగ్ రాకెట్‌కు సూత్రధారి కాగా.. ఈయనకు కోటంరెడ్డి మెంటార్‌గా వ్యవహరించారు. విజయవాడలో హోటల్లో కృష్ణసింగ్‌తో కోటంరెడ్డి కలసి ఉన్న దృశ్యాలు, కృష్ణసింగ్ పరారీ అయినప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉండటానికి కోటంరెడ్డి ఎలా సాయం చేశారో కూడా… పోలీసులు ఆధారాలు సేకరించారు. కృష్ణ సింగ్ నుంచి రూ. 23 లక్షలు కోటంరెడ్డి పుచ్చుకున్నట్లు ఆధారాలు కూడా పోలీసులకు లభించాయి. ఇప్పుడు ఈ కేసు మొత్తం ఏసీబీ చేతుల్లోకి వెళ్లింది.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో.. నెల్లూరు సిటీ, రూరల్ ఇద్దరు ఎమ్మెల్యేల్నీ పోలీసులు విచారణకు పిలిచారు. ఆ తర్వాత కొన్ని ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా మరోసారి విచారణకు రావాలని.. కోటంరెడ్డికి పోలీసులు సమన్లు పంపారు. అయితే విషయం మొత్తం తెలిసిందేమో.. కానీ కోటంరెడ్డి.. నేరుగా పోలీసుల్నే సవాల్ చేశారు. ఏం చేసుకుంటారో..చేసుకోండి.. నేను విచారణకు రానని మీడియా ముందు ఫోజులు కొట్టారు. దీంతో పోలీసులు తమ పని తాము చేశారు. పోలీసులు విచారణకు సహకిరంచలేదని కేసు నమోదు చేశారు. ఆయనపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన కృష్ణసింగ్, బుకీలు, పంటర్లతో శ్రీధర్ రెడ్డి పరిచయాలు, లావాదేవీలపై ఆధారాలు సేకరించారు. వారిపై సెక్షన్ -3, ఎపి గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద వారిని ప్రోత్సహిస్తూ వారికి సహకరిస్తూ వారితో లావాదేవీలు నిర్వహించినట్లు అధారాలు లభించాయి. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ మేరకు మే 14న హాజరుకావాలని కోర్టు సమన్లు పంపింది.
తాజాగా నెల్లూరు ఎస్పీ రామకృష్ణ కోటంరెడ్డి వ్యవహారంపై పూర్తి ఆధారాలను డీజీపీ మాలకొండయ్యకు సమర్పించారు. ఆయన తదుపరి విచారణను ఏసీబీకి అప్పగించారు. దీంతో ఏసీబీ యాక్ట్ కింద కోటంరెడ్డి మీదు కేసు నమోదు చేశారు. కోటంరెడ్డి వ్యవహారం నెల్లూరు రాజకీయాలతో పాటు వైసీపీలోనూ కలకలం రేపుతోంది. తప్పించుకోలేని విధంగా కోటంరెడ్డి దొరికిపోవడంతో ఆ పార్టీకి ఎలా సమర్థించుకోవాలో తెలియడం లేదు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవడం కన్నా… మొత్తం ప్రభుత్వ కుట్ర అంటే.. రాజకీయం చేసినట్లు ఉంటుందని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారు.