మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీ ఆస్తుల వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది రోజుల క్రితం అవినీతి నిరోధక శాఖకు చిక్కిన పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ సంపాదించిన ఆస్తులు కొన్నింటికి ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీగా వ్యవహరిస్తున్న ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై దూకుడుగా విమర్శలు చేస్తూంటారు. వైసీపీ తరపున ప్రభుత్వంపై, చంద్రబాబుపై దూకుడుగా పిటిషన్లు వేస్తూంటారు. కింది కోర్టు లేకపోతే హైకోర్టు.. లేకపోతే సుప్రీంకోర్టు అన్నట్లు ఆయన పట్టు విడవకుండా.. న్యాయపోరాటం చేస్తూనే ఉంటారు. అమరావతి ఆలయ సత్రానికి తమిళనాడులో ఉన్న భూముల వేలంపై కోర్టుకు వెళ్లి.. ఆ వేలం ప్రక్రియను మళ్లీ మొదటికి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. తర్వాత చంద్రబాబుపై ఓటుకు నోటు కేసులో.. ప్రైవేటు ల్యాబ్ లో చంద్రబాబు వాయిస్ టెస్టులు చేయించానంటూ… సంబంధం లేకుపోయినా.. హైదరాబాద్ లోని కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని హైకోర్టు కొట్టి వేసినా..మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా బినామీ ఆస్తుల వివాదంలో ఇరుక్కున్నారు. అదీ కూడా.. అవినీతికి పాల్పడి దొరికిపోయిన ఓ ఉద్యోగికి సంబంధించిన ఆస్తులకు తాను బినామీగా ఉన్నట్లు తేలడంతో ఆయన మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేను విచారణకు పిలవాలంటే.. పోలీసులు అన్ని అధారాలు ఉంటేనే ముందడుగు వేస్తారు. లేకపోతే రిస్క్ తీసుకోరు. పోలీసులు వేధింపులకు పాల్పుతున్నారనే ఆరోపమలు వస్తాయి కాబట్టి… కాస్తంత జాగ్రత్తగానే ఉంటారు. కానీ రామకృష్ణారెడ్డి విషయంలో పూర్తి ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఏసీబీ అధికారులు నోటీసులివ్వడంతో.. .. విచారణలో సరైన సమాధానాలు చెప్పకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి… రాంకీ గ్రూప్ యజమానులైన.. అయోధ్యరామిరెడ్డికి అత్యంత దగ్గరి బంధువులు. వైఎస్ హయాంలో రాంకీ గ్రూప్ భారీగా ఆస్తులు సంపాదించింది. దీనిపై సీబీఐ కేసులు కూడా నమోదయ్యాయి. గత ఎన్నికల్లో అయోధ్యరామిరెడ్డి నరసరావు పేట నుంచి పార్లమెంట్ కు వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆళ్ల మాత్రం ఎమ్మెల్యేగా రెండంకెల ఓట్ల తేడాతో గెలిచి బయటపడ్డారు. అప్పట్నుంచి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏసీబీ కేసులో చిక్కారు.