ఓటుకి నోటు కేసుపై ఎసిబి అధికారులు ఇంకా ఎంత కాలం దర్యాప్తు చేసిన తరువాత దోషులెవరో కనిపెడతారో ఎవరికీ తెలియదు కానీ సుమారు మూడున్నర నెలల తరువాత కూడా నేటికీ ఎవరికో ఒకరికి నోటీసులు ఇస్తూనే ఉన్నారు. మొన్న నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఎసిబి అధికారులు ఈరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులకు నోటీసులు ఇచ్చారు. వారిలో శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి ఒక మద్యం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అని సమాచారం. చైతన్య, విష్ణు అనే మరో ఇద్దరికీ కూడా ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసి ఈ కేసులో విచారణకు మంగళవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. వారికీ ఈ కేసుకి ఏవిధంగా సంబంధమో తెలియదు.
ఈ కేసులో ఎసిబి అధికారుల కంటే ముందే స్పందించిన తెరాస నేతలు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసలు దోషి! అతనిని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని ప్రగల్భాలు పలికేవారు. కానీ మూడున్నర నెలలు అవుతున్నా ఎసిబి అధికారులు ఆయనకి కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పడం లేదు. తెరాస నేతలెవరూ ఇప్పుడు ఈ కేసు గురించే మాట్లాడటం మానేశారు. కానీ వారు ముందే చెప్పినట్లు చట్టం (ఏసిబి) తన పని తాను చేసుకుపోతున్నట్లుంది. మరి ఈ నోటీసుల పర్వం ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో, ఎప్పుడు అటకెక్కుతుందో వారికే తెలియాలి. కానీ తెదేపా నేతల మెడ మీద కత్తిలా వ్రేలాడుతున్న ఈ కేసులో నోటీసుల ఇవ్వడంలో పరమార్ధం మాత్రం వారిని ఆందోళనకి గురి చేస్తూ ఉంచడానికేనని భావించవచ్చును.