విశాఖలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ అరెస్ట్.. తదనంతర పరిణామాలపై రెండు నెలల పాటు చేసిన దర్యాప్తులో కుట్ర కోణం ఉందని.. సీబీఐ గుర్తించింది. గతంలో విచారణకు ఆదేశించిన హైకోర్టు.. సీబీఐకి.. ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. ఈ లోపు దర్యాప్తు చేసిన సీబీఐ… మధ్యంతర నివేదికను… హైకోర్టుకు సమర్పించింది. కుట్రకోణం దాగి ఉందని.. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని.. మరింత సమయం కావాలని అడిగింది. దీంతో హైకోర్టు మరో నెలల సమయం ఇస్తూ.. నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11న పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.
డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థిషియా వైద్యునిగా పనిచేస్తున్నారు. ఓ సందర్భంలో ప్రభుత్వం సరైన రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని… మాస్కులు ఇవ్వలేదని మీడియా ముందు చెప్పడంతో తర్వాత ఆయనను సస్పెండ్ చేశారు. అప్పుడు వైద్యుడు చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. మీడియాలోనూ హైలెట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు… విశాఖలో ఓ రోడ్డుపై అర్థనగ్నంగా పోలీసులు కొట్టుకుంటూ సుధాకర్ ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. అనూహ్యంగా ఆయనను మానసిక ఆస్పత్రికి తరలించి.. పిచ్చివాడనే ముద్రవేయడానికి ప్రయత్నం జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
చాలా రోజుల పాటు సుధాకర్ ను ఆస్పత్రిలోనే నిర్బంధించారు. చివరికి ఈ ఘటనలో.. డాక్టర్ సుధాకర్ కు.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ వైద్యుడి విషయంలో ఇలా వ్యవహరించడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తూ… సీబీఐ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. కుట్ర ఉందని సీబీఐ అంచనా వేయడంతో… ముందు ముందు దర్యాప్తులో వెలుగులోకి రాబోయే విషయాలు కీలకంగా మారనున్నాయి. రెండు నెలల్లో సీబీఐ ఈ మిస్టరీని తేల్చే అవకాశం కనిపిస్తోంది.