తనను ఏసీబీ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని… ఇది కుట్ర అంటూ బాపట్ల జిల్లా ఎస్పీ దగ్గరకు పోయి మంత్రి మేరుగ నాగార్జున ఫిర్యాదు చేశారు. ఓ మంత్రిపై ఏసీబీ కేసు పెట్టేంత ధైర్యం పోలీసులకు ఉంటుందా ? కుట్ర ఎవరు చేస్తారు ? . ఇవన్నీ పక్కన పెడితే.. మంత్రి మెరుగు నాగార్డున దంతా మాత్రం ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైరల్ అవుతోంది.
బాపట్ల జిల్లాలో ఓ స్థల వివాదంలో గోవింద్ అనే వ్యక్తి కారును సీజ్ చేసి.. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు చుండూరు పోలీసులు.. అయితే, ఈ కారు విడిచిపెట్టాలంటే లంచం ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారు. ఇలా లంచం అడగాలని.. ఎస్ఐకి చెప్పింది మంత్రి నాగార్జున. లౌడ్ స్పీకర్ లో ఇదే విషయం చెబుతున్న అంశాన్ని ఆ ఎస్ఐ.. సదరు గోవింద్ కు వినిపించారు. ఆ గోవింద్ దాన్ని రికార్డు చేసుకున్నారు. తర్వాత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
వారు చెప్పిన ప్రకారం ట్రాప్ చేశాడు గోవింద్. డబ్బులు తీసుకుంటున్న కానిస్టేబుళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తర్వాత గోవింద్ అసలు విషయం బయట పెట్టాడు. తన దగ్గర లంచం డిమాండ్ చేసిన విషయంలో పోలీసులతో పాటు, మంత్రి నాగార్జున ప్రమేయం కూడా ఉందని, మంత్రి మేరుగ నాగార్జున డబ్బు తీసుకోమని చుండూరు ఎస్సై తో ఫోన్లో మాట్లాడటం, లౌడ్ స్పీకర్ లో తాను విన్నానంటూ రికార్డు చేసి.. ఓ వీడియో రిలీజ్ చేశాడు..
దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. తన గుట్టు బయటపడటంతో నాగార్జున హడావుడి పడిపోయారు. దీని వెనక ఉన్న కుట్రను దర్యాప్తులో తేల్చాలంటూ పోలీసులను ఆశ్రయించారు.. బాపట్ల జిల్లా ఎస్పీని కలిసిన ఆయన.. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.. ఈ కేసులో ఉన్న కుట్ర కోణాన్ని తేల్చాలని పేర్కొన్నారు. ఇక, తనకు ఈ కేసు ఎటువంటి సంబంధం లేదని గోవింద్ అనే వ్యక్తి ఎందుకు ఆరోపణ చేస్తున్నాడు? దీని వెనక ఎవరు ఉన్నారు? అనే విషయాలను నిగ్గు తెల్చాలనన్నారు. కానీ మంత్రి తీరు.. తేలుకుట్టిన దొంగలా ఉందని ఎక్కువ మంది సెటైర్లు వేసుకుంటున్నారు.