ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అధికారులు ..అవినీతిని చేసేవారిని కాకుండా… తామే.. అవినీతి చేసి.. ఎదుటి వాళ్లను అవినీతి ఉద్యోగులుగా కేసులు పెట్టేందుకు వెనుకాడటం లేదు. విశాఖలో ఇలాంటి ఓ కేసు… సీసీ కెమెరాల సాక్షిగా బయటపడింది. కొద్దిర ోజుల కిందట.. విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సబ్ రిజిస్ట్రార్ తారకేష్ చాంబర్లో సోదాలు చేశారు. అక్కడ రూ. రూ.61,500 దొరికాయని కేసు పెట్టారు. తమ దగ్గర లంచాలు తీసుకుంటున్నారంటూ.. కొంత మంది అప్పటికప్పుడు.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ తారకేష్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
నిజానికి తారకేష్ వద్ద.. ఏసీబీ అధికారులకు ఏమీ దొరకలేదు. ఏసీబీ అధికారులే రూ.61,500 తీసుకెళ్లి అక్కడ పెట్టారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని సేకరించిన బాధిత సబ్ రిజిస్ట్రార్ తారకేష్… మంత్రి సుభాష్ చంద్రబోస్కు ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన ఆయన బీపీని కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు. కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ డీజీతోనూ.. హోం మంత్రితోనూ ఈ అంశంపై మాట్లాడాను.ఈ కేసు విషయంలో విచారణే అవసరం లేదు.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయి.తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. తప్పు చేసిన ఏసీబీ అధికారుల మీదా అలాగే కేసులు పెట్టాలి. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి.. సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేస్తున్నారు. లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయించడం ఏమిటని.. పిల్లి సుభాష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన విశాఖ రేంజ్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
గత ప్రభుత్వంలో ఏసీబీ క్రియాశీలకంగా పని చేసింది. ఉన్నత స్థాయి అధికారులను కూడా వదిలి పెట్టలేదు. లంచాలతో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టిన వారిపై విరుచుకుపడింది. ఏసీబీ పనితీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏసీబీ అధికారులే లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే.. దొంగ కేసులు నమోదు చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారు. ఇప్పుడీ విషయం బయటపడింది. ఇంకెన్ని.. వ్యవహారాలు బయటకు వస్తాయో..?