కేరళను ఎవరు ఆదుకుంటారు..? ఇప్పుడు ఈ ప్రశ్న కేరళ వాసుల నుంచి కేంద్రానికి సూటిగా తలుగుతోంది. వందేళ్లలో కనీవినీ ఎరుగనంత ప్రకృతి ప్రళయం… కేరళను చుట్టుముడితే కనీసం.. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కూడా కేంద్రానికి మనసు రాలేదు. రూ. 600 కోట్లు సాయం ప్రకటించి చేతులు దులుపుకుంది. కానీ కేరళ మాత్రం రూ. 20వేల కోట్ల నష్టం జరిగిందని.. కనీసం తక్షణ సాయంగా రూ. 2,600 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. కానీ కేంద్రం మాత్రం .. ఇంకే సాయమూ అందదన్నట్లుగా వ్యవహరిస్తోంది. అంతే కాదు… విదేశాల నుంచి కేరళకు వచ్చే సాయం కూడా రాకుండా చేయాలని నిర్ణయించింది. ఇతర దేశాలు కేరళకు మానవతా దృక్పథంతో చేయాలనుకున్న సాయాన్ని కూడా… ఆమోదించకూడదని నిర్ణయించుకోవడం కేరళ వాసుల్లో తాజా ఆగ్రహానికి కారణం అయింది.
ప్రజలే కాదు… కేంద్రం తీరుపై పార్టీలకు అతీతంగా కేరళ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేస్తామంటున్న రూ. 700 కోట్ల సాయాన్ని అంగీకరించకపోతే… ఆ మొత్తాన్ని కేంద్రం ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నారు. కేరళ ప్రజలు.. యూఏఈని ఓ ప్రత్యేకమైన దేశంగా చూడరని.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేస్తున్నారు. ఆ దేశానికి కేరళీయులు చేసిన సేవకు కృతజ్ఞతగానే సాయం చేస్తున్న విషయాన్ని ఆయన కేంద్రానికి గుర్తు చేస్తున్నారు. 2016 జాతీయ విపత్తు నిర్వహణ విధానంలో… విపత్తులు సంభవించినప్పుడు.. విదేశీ సాయం తీసుకోవచ్చని ఉన్న విషయాన్ని విజయన్ గుర్తు చేస్తున్నారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా.. ఇదే విషయాన్ని చెబుతున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ విధానం.. తొమ్మిదో చాప్టర్ లో విపత్తులు సంభవించినప్పుడు.. స్వచ్చందంగా విదేశాలు సాయం చేయడానికి వస్తే తీసుకోవచ్చని ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. విదేశీ సాయం కోసం.. ఎవరూ విజ్ఞప్తి చేయలేదనే విషాయన్ని కేరళ వాసులు గుర్తు చేస్తున్నారు.
అదే కేరళ విషయంలో కేంద్రం ఏ మాత్రం… తన విధానాన్ని మార్చుకోవడమో.. సడలించడమో చేసే అవకాశం కనిపించడం లేదు. తాము విపత్తుల్ని ఎదుర్కోగలమని.. చెబుతోంది కానీ.. కేరళ విషయంలో ఎలాంటి ప్రణాళికలు చెప్పడం లేదు. కేరళను అలా వదిలేస్తారా.. ? పునర్ నిర్మాణానికి ఏమైనా సాయం చేసే ఉద్దేశాలు ఉన్నాయా అన్న దానిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టతా రావడం లేదు. ఇది కేరళ వాసుల్ని మరింతగా ఆగ్రహానికి గురి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే.. కేంద్రం తరపు నుంచి రుణపరిమితి పెంచడం దగ్గర్నుంచి అనే సాయాలు కేరళ కోరుతోంది. కానీ కేంద్రం మాత్రం.. దేనిపైనా స్పందించడం లేదు.