ఉత్తినే ఎవరూ మెగాస్టార్లు కారు. సినిమాపై అంకిత భావం ఉండాలి. కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఇవి రెండూ మెండుగా ఉన్నాయి కాబట్టే.. చిరు ఈ స్థానానికి వచ్చాడు. స్వయం కృషి అనే పదానిని తానే నిలువెత్తు నిదర్శనం. ఈ వయసులో కూడా అదే కష్టం. అంతే శ్రమ. చిరు చేతిలో మూడు సినిమాలున్నాయిప్పుడు. ఓ సీనియర్ హీరో చక చక సినిమాలు చేయడం, కొత్త సినిమాల్ని స్పీడు స్పీడుగా పట్టాలెక్కించడం యువతరానికి ఆదర్శప్రాయమే. సెట్లో కూడా చిరు చాలా చలాకీగా ఉంటున్నారని, ఆయన ఎనర్జీ చూస్తే అందరికీ ముచ్చటేస్తోందని.. ఆయనతో పనిచేస్తున్న దర్శకులు ముక్త కంఠంతో చెబుతున్నారు.
చిరు – బాబి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వాల్తేరు శ్రీను టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించినయాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. అందులో భాగంగా చిరంజీవి ఏనుగుపై సవారీ చేసే సీన్ ఉందట. ఈ సందర్భంగా ఏనుగుపై షూటింగ్ చేస్తుండగా.. దాన్నుంచి కిందకి దిగేక్రమంలో.. చిరు జారి పడ్డారని, ఈ సందర్భంగా ఆయన కాలు బెణికిందని తెలుస్తోంది. అయినా సరే.. ఆ నొప్పిని ఓర్చుకొంటూ… ఆ రోజు చిరు షూటింగ్ పూర్తి చేశార్ట. తాను వెళ్లిపోతే.. షూటింగ్ డిస్ట్రబ్ అవుతుందని, మిగిలినవాళ్ల కాల్షీట్లు వేస్ట్ అవుతాయని చిరు భావించి – ఆ బాధతోనే తన సీన్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇలాంటి ఉదంతాలు.. చిరు కెరీర్లో ఎన్నో..ఎన్నెన్నో. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యింది