సీఎం జగన్ భార్య భారతి పేరు మీద ఉన్న భారతి సిమెంట్స్ పై ఉన్న అక్రమాస్తుల కేసులు, అవినీతి, మనీలాండరింగ్ కేసులపై ఈడీ సవాల్ చేసిన ఓ కేసులో జరగాల్సిన విచారణ బెంచ్ హఠాత్తుగా మారిపోవడం సుప్రీంకోర్టు వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ అంశంపై న్యాయవాద వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. సౌరవ్ దాస్ అనే ఇన్వెస్టిగేవటివ్ జర్నలిస్ట్ దీనికి సంబంధించిన కన్స్పైరసీ మొత్తాన్ని మొత్తాన్ని సోషల్ మీడియాలో బయట పెట్టారు. పూర్తి ఆధారాతో పెట్టిన ఈ సోషల్ మీడియా పోస్టు .. ఏపీతో పాటు ఢిల్లీ న్యాయవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో భారతి సిమెంట్స్ కు సంబంధించి గతంలో ఈడీ కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. అయితే హైకోర్టు ఆ జప్తును తొలగించింది. దీనిపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జస్టిస్ మురారి, జస్టిస్ అమానుల్లా ధర్మాసనంలో జరగాల్సినట్లుగా లిస్ట్ అయింది. అయితే హఠాత్తుగా అది లిస్ట్ నుంచి డిలీట్ అయింది. తర్వాత కేసును కోర్టు నెంబర్ 15కు కేటాయించినట్లుగా కంప్యూటర్లో లిస్ట్ అయింది. ఇది ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కోర్టు నెంబర్ 15లో విచారణ జరిపేది జస్టిస్ వి.రామసుబ్రమణియన్.
కేసు ఈయన దగ్గరకే ఎందుకు వెళ్లిందో.. కూడా సౌరవ్ దాస్ విశ్లేషించారు. జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దగ్గర కోర్టు క్లర్క్ గా పని చేస్తున్నది సిర్గాపురపు నిరంజన్ రెడ్డి కుమారుడు. ఈ నిరంజన్ రెడ్డి ఎవరో కాదు వైసీపీ ఎంపీ కమ్ సుప్రీంకోర్టు లాయర్ . జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఎప్పట్నుంచో వాదిస్తున్నారు. ఈయన కుమారుడు కోర్టు క్లర్క్ పని చేస్తున్న న్యాయమూర్తి దగ్గరకు కేసు లిస్ట్ అయింది. ఈ విషయాన్ని సౌరవ్ దాస్ ప్రశ్నిస్తున్నారు.
అసలు సుప్రీంకోర్టు రిజిస్ట్రి హఠాత్తుగా కేసుల్ని ఓ బెంచ్ మీద నుంచి మరో బెంచ్ మీదకు ఎందుకు మారుస్తున్నారు..? దీని వెనుక అసలేం జరిగింది ? అన్న అనుమానాలను సౌరవ్ దాస్ న్యాయవ్యవస్థ ముందు ఉంచారు. ఇది బెంచ్ హంటింగ్కు పాల్పడటమేనని.. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేలా సుప్రీంకోర్టులో పరిణామాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఉద్యోగులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ అంశం సుప్రీంకోర్టులోనూ సంచలనంగా మారుతూండటంతో ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.