మాచర్ల పోలీస్ స్టేషన్లో మోహన్ అనే ఎస్ఐ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సీఐ రాజేశ్వరరావు వచ్చారు. పోలీస్ స్టేషన్లో పుట్టిన రోజు వేడుకలేంటి అనుకునే పరిస్థితి లేదు.. ఆ సిట్యూయేషన్ ఎప్పుడో దాటిపోయింది. కానీ.. ఆ సీఐ రాజేశ్వరరావు కూడా పుట్టిన రోజున రోజు వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి రాలేదు. అసలు ముఖ్య అతిధిగా ఉన్నారు. ఆయనే తురకా కిషోర్. తురకా కిషోర్ వచ్చిన తర్వాత ఎస్ఐ మోహన్ కేక్ కట్ చేశారు. తరుకా కిషోర్ పోలీసుల్ని అభినందించి ..శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు. అంత వరకూ బాగానే ఉంది.. మరి ఈ తురకా కిషోర్ ఎవరు.. సీఐ రాజేశ్వరరావు కన్నా పెద్దనా..? డీఎస్పీనా..? స్టేషన్లో జరిగిన పుట్టిన రోజు వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చేంత పెద్ద మనిషినా..?
ఈ తురకా కిషోర్ గతంలో పోలీస్ స్టేషన్కు చాలా సార్లు వచ్చారు. అయితే అయన వచ్చిన విధానం వేరు. నిందితుడిగా వచ్చారు. ఆయన కొన్నాళ్ల కిందట రౌడీషీటర్ కూడా. ఆయనకు ట్రేడ్ మార్క్ హిస్టరీ ఉంది. కొద్ది రోజుల కిందట.. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో ఓ రోజు మాచర్లకు వెళ్లిన బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరావుల కారుపై పెద్ద దుంగతో దాడి చేసి .. హత్యకు ప్రయత్నించిన వ్యక్తి గుర్తున్నారా..?. ఆ ఘటనలో ప్రధాన పాత్ర ఈ తురకా కిషోర్దే. వారిపై హత్యాయత్నం చేసిన తురకా కిషోరే.. ఎస్ఐ మోహన్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రధాన అతిధనన్నమాట.
మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై పట్ట పగలు హత్యాయత్నం చేస్తే.. పోలీసులు అప్పుడే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని చర్చకు పెట్టింది. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఆయన ఎమ్మెల్యే మద్దతుతో మాచర్ల పట్టణానికి మున్సిపల్ చైర్మన్ కాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అంత దారుణంగా పట్ట పగలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై హత్యాయత్యానికి పాల్పడిన నిందితుడికే రాచమర్యాదలు దక్కిన తర్వాత ఇంకెవరైనా నామినేషన్లు వేస్తారా..? వేయనిస్తారా..?. వేయనివ్వలేదు. అక్కడ ఏకగ్రీవంగా ఆయన మున్సిపల్ చైర్మన్ కావడం ఖాయమని పోలీసులు అంచనాకొచ్చేరేమో కానీ.. పుట్టిన రోజు వేడుకలకే ముఖ్య అతిథిగా పిలిపించేసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.