ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ దొరక్కుండా చాలా కాలంగా విదేశాల్లో ఉంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు హఠాత్తుగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నపళంగా ఎక్కి హైదరాబాద్లో దిగబోతున్నారు. ఆయను అరెస్టు చేసే చాన్స్ లేదు కానీ.. విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఏ 1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు కూడా త్వరలో వచ్చేయనున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరడంతో రెండు వారాలకు వాయిదా పడింది. ప్రభాకర్ రావు ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్లి రిలీఫ్ తెచ్చుకుని ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి వీరిద్దరూ విదేశాల్లోనే ఉన్నారు. వారు వస్తే అరెస్టు చేస్తామని.. వారితో పాటు ట్యాపింగ్ చేయించిన బీఆర్ఎస్ అగ్రనేతల్ని కూడా అరెస్టు చేస్తామని అంటున్నారు. కానీ వారినే అరెస్టు చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
ఇప్పటికే చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. ట్యాపింగ్ ను నిరూపించడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నన సమయంలో.. నిందితులకు వరుసగా బెయిల్స్ రావడం.. పరారీలో ఉన్నారని భావిస్తున్న వారికి రక్షణ లభించడంతో ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రారంభమయింది.