తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కింజరాపు అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. సాధారణంగా ప్రభుత్వంలో హోంమంత్రి పదవిని… పార్టీలో అధ్యక్ష తరహా పదవుల్ని డమ్మీలకు కేటాయిస్తూంటారు. వారిని అక్కడ కూర్చోబెట్టి పనులన్నీ.. సీఎం.. పార్టీ అధ్యక్షుడే చేస్తూంటారు. కానీ ఈ సారి చంద్రబాబు ట్రెండ్ మార్చారు. పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన కింజరాపు అచ్చెన్నాయుడును నియమించారు. ఇప్పటి వరకు కళా వెంకట్రావు ఆ స్థానంలో ఉన్నారు. కానీ ఆయన ప్రెస్నోట్లకే పరిమితం. కానీ అచ్చెన్న ఆ స్టైల్ కాదు. దూకుడుగా వెళ్తారు. చంద్రబాబు కూడా.. అలాంటి దూకుడు కావాలనే.. అచ్చెన్నను నియమించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎర్రన్నాయుడు నీడలో రాజకీయాలు ప్రారంభించినా.. అచ్చెన్నాయుడుకి తనదైన బాణి ఉంది. విపక్షం ఆయన వాయిస్‌నే కాదు.. ఒడ్డూ.. పొడుగును చూసి కూడా భయపడుతుంది. అధికారపక్షానికి కొరకరాని కొయ్యగా మారారు. వివిధ అంశాలపై అవగాహన పెంచుకుని శాసనసభలో అధికారపక్షాన్ని ఇరుకునపెట్టారు. చివరికి అరెస్ట్ కూడా చేయించారు. రెండున్నర నెలల పాటు జైల్లో ఉంచారు. అయినప్పటికీ అచ్చెన్నాయుడు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. స్వరం పెద్దది కావడం, ఎత్తుగా ఉండటంతో నాలుగైదుసార్లు సీఎం జగన్ కూడా ఆయనను బాడీ షేమింగ్ చేసి విరుచుకుపడ్డారు. అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. పార్టీపై నిబద్ధత కూడా శంకించలేని విధంగా ఉంటుంది. దీంతో.. చంద్రబాబు అచ్చెన్నను మంచి చాయిస్‌గా భావించారు.
ఏపీ టీడీపీలో అచ్చెన్నకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆయననే ముందు పెట్టి.. పార్టీని నడిపించాలన్న ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని అచ్చెన్నాయుడుతో చర్చించిన తర్వాత ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. కేసులకు భయపడి సైలెంట్‌గా ఉన్న వారికి కాకుండా.. ప్రభుత్వంపై పోరాడుతున్న వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయంలో అచ్చెన్న అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తారు. ఏపీలో కాలికి గజ్జె కట్టుకుని తిరుగుతానని, అధికార పార్టీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కేడర్ ను, లీడర్లను కలుపుకుని పోరాటం చేస్తానని అచ్చెన్న ప్రకటించారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తానన్నారు.