తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5
ఇదో తాత కథ
సంక్రాంతికి ఇంటికొచ్చిన హరిదాసు కాళ్లపై పడున్నప్పుడు మా బామ్మ ‘కెవ్వు’న కేకేసింది
– ఎందుకు..?
పురిటినొప్పులు.. అప్పుడే మా తాత పుట్టాడు.
మా తాత పుట్టగానే ఏడ్చాడు
ఐదేళ్ల వయసులోనే మా తాతకు ఐదేళ్లూ నిండాయి
పెళ్లీడు రాగానే పెళ్లీడొచ్చిన అమ్మాయిలకే లైనేశాడు
కానీ ఎవ్వరూ మా తాత ప్రేమలో పడలేదు
అందుకే మా తాత బావిలో పడ్డాడు.
అప్పటికే మా నాన్నమ్మ బావిలో ఉంది
నా కోసమే పడ్డావా.. అని పెళ్లి చేసేసుకుంది
మా తాత జిలేబీలు వండాడు
భలే జిలేబీలు అని తింటుంటే అది జిలేబీ కాదు మైసూర్ పాకూ అన్నాడు
మైసూరు పాకంతో జిలేబీ చేశాడన్నమాట..
– ఎలా ఉంది ఈ కథ..?
ఈ కథ రాసినోడ్ని, చెప్పినవాడ్నీ ఎడా పెడా లాగి కొట్టేయాలనిపిస్తోంది కదూ. కానీ అక్కడితో ఆగిపోండి. ఇంకో కథ చెబితే.. ఈ తాతయ్య కథే బ్రహ్మాండం అంటారు. ఓ సినిమా గురించి చెబితే. `ఈ తాత కథని సినిమాగా తీస్తేనే పోయేది కదా` అనిపిస్తుంది. `ఆచారి అమెరికా యాత్ర`లో తాత కథ ఓ ఉప కథ, పిట్ట కథ. సిల్లీ కథ. దీంతో పోల్చి చూస్తే.. `ఆచారి` కథే దారుణం అనిపిస్తుంది. ఎలాగంటారా?
* కథ :
విష్ణు, బ్రహ్మానందం గురు శిష్యులు. బ్రాహ్మణులు. వాళ్లు ఓ ఇంట్లో యాగం జరిపితే.. ఆ ఇంటి పెద్దైన కోట శ్రీనివాసరావు గుండాగి ఛస్తాడు. ‘మా ఇంట్లోవాళ్లనే చంపేస్తావా’ అంటూ ప్రదీప్ రావత్ వెంటపడతాడు. చర్చిల్లో, మసీదుల్లో దాక్కుని, ఇక దాక్కోడానికి చోటు లేక అమెరికా పారిపోతారు గురు శిష్యులు. అక్కడ పూజలు పునస్కారాలూ చేసుకోకుండా ఓ అమ్మాయిని వెదుక్కుంటూ ఉంటాడు. `అదేంట్రా శిష్యా` అని అడిగితే.. ‘నేనొచ్చింది ఆ అమ్మాయి కోసమే గురువా’ అని అసలు కథ చెబుతాడు విష్ణు. ఆ అసలు కథేంటి? ఆ కథకీ ఇప్పుడు చెప్పుకున్న కథకీ లింకేంటి? ఈ రెండు కథల మధ్య ఆ తాతయ్య కథేంటి? ఇవన్నీ తెలియాలన్న కుతూహలం మీకు కలిగితే ఆచారి అమెరికా యాత్ర చూడాలి.
* విశ్లేషణ :
కథని సూత ప్రాయంగా చెబితే.. ఇందులో కథేముంది? అని అడగొచ్చు. కానీ మీరలా అడక్కూడదు. ఎందుకంటే ఇది మల్లాది కృష్ణమూర్తి నవల నుంచి ఎత్తేసిన పాయింటు. ఆయన కథలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి ఓ కథ రాశాడంటే… కచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుందని భ్రమపడతాం.. ఆ తరవాత బాధ పడతాం. చివరికి పెద్ద పెద్ద పేర్లుంటే అవి పెద్ద కథలు అవ్వవు అనే నిజం చివరాఖరికి బోధపడుతుంది. ఇంతటి పేలవమైన కథతో నాగేశ్వరరెడ్డి సినిమా తీయడం ఇదే తొలిసారేమో. కథ లేదు సరే, కథనంపైనా దృష్టి పెట్టలేదు. హాస్యనటుల్ని ఓ గుంపుగా తీసుకొస్తే హాస్యం పుట్టేస్తుందా? కథ బాగుంటే సన్నివేశాలు బాగా వస్తాయి. సన్నివేశాలు బాగా వస్తే.. అందులోంచి కామెడీ పుడుతుంది. ప్రధాన పాత్రలన్నీ ‘ఏవండోయ్.. ఇది విన్నారా.. మీరు మరీ సరసులు అయిపోతున్నారు సుమీ’ అంటూ.. బ్రాహ్మిణ యాస మాట్లాడితే కామెడీ పుట్టదు. సినిమాలో సగం సన్నివేశాలు యాగం, పూజల చుట్టూ తిరుగుతుంటాయి. ఒకే లొకేషన్ చూసీ చూసీ బోర్ కొట్టేస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా పుట్టేస్తుందో తెలీదు. అమెరికా రావడం, ఇక్కడ బ్రహ్మానందం వేసే వేషాలు, ఆయన ఎక్స్ప్రెషన్లు.. అన్నింటికీ కామన్ గా ఒకే దండం పెట్టేయాలనిపిస్తుంది. విశ్రాంతి ముందు ‘నువ్వు అమెరికా ఎలా వస్తావో నేనూ చూస్తా’ అంటూ విలన్ పై ఫోన్లోనే సవాల్ విసురుతాడు విష్ణు. పోనీ సెకండాఫ్‌లో అయినా బ్రహ్మాండమైన మైండ్ గేమ్ ఏదో ఉండి ఉంటుంది అనుకుంటే.. దాన్నీ నాసిరకమైన సీన్లతో బేజారెత్తించేస్తాడు.
శుభం కార్డు కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. ఫృథ్వీ ఎంట్రీ ఇస్తాడు. పైన చెప్పుకున్న ‘తాత కథ’ ఆయనదే. అసలు ఆ ట్రాక్ ఏమిటో, ఆ తాతయ్య గోల ఏమిటో అర్థం కాదు. జి.నాగేశ్వరెడ్డి రాసుకున్న స్క్రిప్టు కంటే తాత కథే బెటర్ అనుకుంటే.. అది అంత వరకూ రెండు గంటల పాటు పడిన నరకయాతనలోంచి పుట్టుకొచ్చిన నిస్సహాయతే అనుకోవాలి. చాలా చోట్ల కనీసం లిప్ సింక్ అస్సలు కుదర్లేదు. అంటే… సెట్లో ఏవోవో డైలాగులు రాసుకుని, డబ్బింగ్ థియేటర్లో కరెక్ట్ చేసుకున్నారన్నమాట.
* నటీనటులు :
ఇలాంటి కథని సూపర్ స్టార్ల చేతిలో పెట్టినా… చేతులెత్తేస్తారు. విష్ణు ఏం చేస్తాడు? సినిమా ఒప్పుకున్న పాపానికి తన వంతు ప్రయత్నం చేసుకుంటూ పోయాడు. కానీ విష్ణులో జోష్ కనిపించలేదు. వెయ్యి సినిమాలు చేసిన బ్రహ్మానందం చేష్టలుడికిపోయేలా చూస్తుండిపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవొచ్చు. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ కోసం పనికొచ్చింది. తనని మాత్రం అందంగా చూపించారు. కోట శ్రీనివాసరావు చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. ప్రదీప్ రావత్‌కి ఇచ్చిన డబ్బింగ్ ఏమాత్రం సూటవ్వలేదు. సురేఖావాణి నడిచొస్తున్న షాట్లలో బ్లర్ లు కనిపించాయంటే… దర్శకుడి రసికత ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవొచ్చు.
* సాంకేతికంగా..
మంచి కథకు టెక్నికల్ సపోర్ట్ తోడైతే బాగుంటుంది. ఇలాంటి కథకు రెహమాన్ , పీటర్ హెయిన్స్, శ్రీకర్ ప్రసాద్‌లు కట్టకట్టుకుని వచ్చినా ఏం చేయలేరు. పాటలు, వాటి ప్లేస్ మెంట్స్ గురించి ఏం చెప్పుకుంటాం? డైలాగుల్లో ఒక్కటీ పేలలేదు. ఒక్క సన్నివేశం కూడా మనస్ఫూర్తిగా నవ్వుకునేలా లేదు. ఇది దర్శకుడి వైఫల్యమే.
* తీర్పు :
విష్ణు – నాగేశ్వరెడ్డి సినిమా అంటే అద్భుతాలెవరూ ఆశించరు. కనీసం టైమ్ పాస్ అయిపోతే చాలు అనుకుంటారు. ఆ విషయంలో కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఈ ఆచారి.
* ఫైనల్ టచ్: ఆచారి అమెరికా ‘యాతన’
తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5