Acharya Movie Review
రేటింగ్: 1.5/5
చిరంజీవి… ఓ మెగాస్టార్.
ఆయనుంటే చాలు కథక్కర్లెద్దు.. అనుకునే రేంజ్.
పాటలు, డాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగులు… ఇవన్నీ కలిస్తే… విందు భోజనమే. ఆ తరవాతే కథ, కాకరకాయ్!
అయితే ఇది ఇప్పటి మాట కాదు. ఈ తరం ఆలోచన కాదు.
స్టార్లు ఎంతమంది ఉన్నా – వాళ్లని నిలబెట్టేది కథే అని నమ్మే రోజుల్లో ఉన్నాం. ఎంత బడ్జెట్ పెట్టినా, ఎన్ని కోట్లు కుమ్మరించినా, కథే ప్రాణం.. అని నమ్ముతున్న తరంలో ఉన్నాం. ఆర్.ఆర్.ఆర్లు, కేజీఎఫ్‌లు, బాహుబలుల కాలంలో ఉన్నాం. ఇప్పుడు కూడా… చిరంజీవి ఉంటే చాలు.. అనుకుంటే కష్టం. ఈ విషయం చిరంజీవికి కూడా తెలిసే ఉంటుంది. కొరటాల శివ సైతం మంచి కథకుడాయె. ఆయనకు ఫ్లాపంటేనే తెలీదు. మరి వీరిద్దరూ కలిసి చేసిన `ఆచార్య`.. పాఠం చెప్పాడా? లేదంటే… గుణ పాఠం నేర్చుకున్నాడా?
ధర్మం పునాదుల మీద నిలబడిన ప్రాంతం.. ధర్మస్థలి. భక్తి శ్రద్ధలకు ప్రతీక. ధర్మస్థలిని అనుకుని ఉన్న పాదఘట్టం.. ఆయుర్వేదానికి ప్రసిద్ధి. తరతరాలి నుంచి ఆ ప్రాంత ప్రజలు.. ధర్మస్థలిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి చోట అధర్మం, హింస రాజ్యమేలుతున్నాయి. అలాంటప్పుడే… ఆచార్య (చిరంజీవి) ధర్మస్థలిలో అడుగుపెట్టాడు. పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత తన భుజాలపై వేసుకున్నాడు. ఆచార్య నక్సల్ ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన మనిషి. తనకూ.. ధర్మస్థలికీ సంబంధం ఏమిటి? సిద్ధ (రామ్ చరణ్) ధర్మస్థలి కోసం ఏం చేశాడు? అసలు సిద్ధకూ, ఆచార్యకూ ఉన్న లింకేమిటి? ధర్మస్థలిలో ఎలాంటి అరాచక పాలన సాగుతోంది? వాటి వెనుక ఉన్న కథేమిటి? ఇవన్నీ `ఆచార్య` చూసి తెలుసుకోవాల్సిందే.
కొరటాల కథలెప్పుడూ రేఖామాత్రంగానే ఉంటాయి. కాకపోతే.. అందులో ఎమోషన్లు బలంగా ఉండేలా చూసుకుంటాడు. స్వతహాగా రచయిత కదా? సంభాషణలు బాగుంటాయి. పాత్రల్ని తీర్చిదిద్దడం బాగుంటుంది. బహుశా.. ఇవి నమ్మే… ఈ చిన్న కథని పట్టాలెక్కించడానికి చిరు ఒప్పుకుని ఉంటాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను… ఇవన్నీ చిన్న కథలే. అయితే వాటిలో జరిగిన మ్యాజిక్.. `ఆచార్య`లో కనిపించలేదు. ధర్మస్థలి, పాద ఘట్టం.. ఇవి రెండూ రెండు బలమైన ఎమోషన్లు. వాటిని ముందు ఇంజెక్ట్ చేస్తేనే తప్ప, సిద్ధ, ఆచార్య పాత్రలు ఎక్కవు. అక్కడ జరిగే సంఘటనలతోనూ, సన్నివేశాలతోనూ ప్రేక్షకుడు ప్రయాణం చేయలేడు. కొరటాల చేసిన పెద్ద తప్పు ఇదే. ధర్మస్థలి, పాద ఘట్టం.. ఇవి రెండూ ఆల్ జీబ్రా సూత్రాలంత కష్టంగా, క్లిష్టంగా కనిపిస్తాయి. దాంతో… కథలోకి వెళ్లడానికి ప్రేక్షకుడి మనసు మొరాయిస్తుంది. అలాంటప్పుడు ఆచార్య వచ్చి – అక్కడ శత్రు సంహారానికి పూనుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది?
మధ్యమధ్యలో `లాహే లాహే..` అంటూ చిరు స్టెప్పులు వేయడానికి అనువుగా ఉండేలా పాటల్ని కథలో ఇరికించడం ఇంకాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కామ్రెడ్ కథని… కాసుల కథలో ఇరికించడం.. చాలా తెలివితక్కువ ఆలోచన. చిరు సిగ్నేచర్ స్టెప్పులేస్తున్నా.. దానికి కనెక్ట్ కాకపోవడం, ఊపు రాకపోవడం.. ఇన్నేళ్ల కెరీర్లో ఇదే మొట్టమొదటి సారేమో. దానికి కారణం… ఆ పాత్ర ఔచిత్యానికి తగ్గట్టుగా సన్నివేశాలు లేకపోవడమే. కాజల్ పాత్రని తొలగించడం విషయంపై పెద్ద చర్చే సాగింది. కాజల్ ఉంటే బాగుంటుందేమో…? అని అంతా అనుకున్నారు. నిజానికి ఈ సినిమా విషయంలో కొరటాల ఏదైనా మంచి పని చేశాడంటే అది ఇదే. కాజల్ ఉండుంటే, ఆమె కోసం మరిన్ని సన్నివేశాలు పాటలు ఇరికించాల్సివచ్చేది. అప్పుడు ఈ తలనొప్పి మరింత ఎక్కువయ్యేది. నిజానికి పూజా హెగ్డే పాత్రని లేపేసినా.. కథకొచ్చే నష్టం ఏమీ ఉండేది కాదు. కాకపోతే.. ఆ మాత్రం గ్లామరైనా లేకపోతే ఎలా? అని కొరటాల భావించి ఉంటాడు.
ఆచార్య పాత్రని బలంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడన్న విషయం.. తొలి సగంలోనే అర్థమైపోతుంది. దాంతో అందరి దృష్టీ సిద్ధ పాత్రపై పడుతుంది. ఆ పాత్రైనా ఆకట్టుకుంటుందేమో? సినిమా గాడిన పడుతుందేమో అనే చిన్న నమ్మకం. సిద్ధ పాత్ర ఓకే అనిపిస్తుంది తప్ప… కథని, అప్పటికే మునిగిపోయిన ఆచార్యని `సిద్ధ` ఒడ్డున పడేయలేకపోయాడు. చిరు, చరణ్ లు పక్క పక్కన నిలబడి స్టెప్పులు వేయడం, ఫైట్లు చేయడం వరకూ ఓకే. కానీ ఆ కెమిస్ట్రీ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. హీరోలే వీక్ గా ఉంటే, ఇక విలన్లు మాత్రం ఎంత మంది ఉండి ఏం లాభం? సోనూసూద్ లాంటివాడు కూడా తేలిపోయాడు. తనికెళ్ల భరణి నటన కూడా ఓవరాక్షన్ లా కనిపిస్తుంది. టోటల్ గా కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు.. ఈ సినిమాలో కనిపించే చిన్న చిన్న ప్లస్సులు సైతం, మరుగున పడిపోయి… అన్నీ మైనస్సులుగా మారిపోయాయి.
చిరు ఈజ్‌కి తన క్రేజ్‌కి తగిన కథ కాదిది. యంగ్ గా కనిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. పాత సినిమాలో చిరు లుక్‌ని సీజీలో వాడిన విధానం కామెడీగా అనిపిస్తుంది. చిరు స్టెప్పలు విషయంలో రాజీ పడకపోయినా… అవన్నీ ఈ కథలో, ఆచార్య క్యారెక్టరైజేషన్లో ఇమడలేదు.రామరాజుగా చూసిన కళ్లతో సిద్ధని చూస్తే మరుగుజ్జుగా కనిపిస్తాడు. పూజా హెగ్డే.. ఉన్నదంటే ఉన్నదంతే. వెన్నెల కిషోర్, రవి కాలే లాంటివాళ్లు కూడా ఈ సినిమాలో ఉన్నారంటే.. రెండు మూడు సార్లు ఈ సినిమా చూసినవాడు కూడా నమ్మలేని పరిస్థితి. సీనియర్ ఆర్టిస్టుల్ని జూనియర్ల స్థానంలో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులుగా మార్చుకొన్న ఘనత.. ఈ సినిమాకి దక్కుతుంది.
మణిశర్మ ఈ సారి టెంపోని అందుకోలేదు. లాహె.. లాహె పాటొక్కటే బాగుంది. కానీ అది కూడా కథలో ఇరికించిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో బాదుడు తప్ప ఎమోషన్ కనిపించలేదు. టెంపుల్ సిటీని కళ్లముందుకు తీసుకొచ్చిన ఆర్ట్ డైరెక్టర్ పనితనం, కెమెరా వర్క్, నిర్మాత పెట్టిన ఖర్చు ఇవన్నీ పేలవమైన కథ, కథనాలు, క్యారెక్టరైజేషన్ మధ్య నలిగిపోయాయి.
స్టార్లుంటే పని అవ్వదు. బలమైన కథ, పాత్రలు, ఎమోషన్ ఉన్నప్పుడే సినిమాలు నిలబడతాయి. కథల ఎంపిక విషయంలో.. చిరు జడ్జిమెంట్ బాగుంటుంది అనుకున్నవాళ్లంతా.. ఈ కథకు ఎలా ఓకే చెప్పాడా అని ఆశ్చర్యపోతారు. చిరు ఫ్లాప్ సినిమాల్ని కూడా అభిమానం కొద్దీ భరించే వీర ఫ్యాన్స్‌కి సైతం.. ఆచార్య మింగుడు పడడు. కొరటాల లాంటి వాళ్లు కూడా కథల విషయంలో తప్పులు చేస్తారు.. అనే పాఠం ప్రేక్షకులకు, కథ లేకపోతే పప్పులు ఉడకవు అనే గుణపాఠం దర్శక నిర్మాతలకు.. నేర్పిన సినిమాగా ఆచార్య మిగిలిపోతుంది.
ఫినిషింగ్ టచ్: ఆచార్య `వద్దో` భవ
రేటింగ్: 1.5/5