కారణాలు ఏమైనా కానివ్వండి. రెండేళ్ల నుంచీ సెట్స్‌పైనే ఉంది ఆచార్య. ఇప్పుడు ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సినిమాని రామ్ చరణ్ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నిర్మించాడు. ఈ సినిమాలో కొరటాల శివ వాటా కూడా ఉంది. నిజానికి మాట్నీ, కొణిదెల ప్రొడక్షన్స్ వంటి పేర్లు పోస్టర్ పై కనిపిస్తున్నా… ఈ సినిమా ప్రొడక్షన్ కూడా కొరటాలనే చూసుకున్నాడు. లాభనష్టాల్లో కొరటాలకూ భాగం ఉంది. అయితే ఇప్పుడు కొరటాల ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడని, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్కి ఇవ్వాల్సిన సొమ్ముని ఇచ్చేసి.. సెటిల్ చేసుకున్నాడని, ఇక మీదట ఆచార్య సినిమాకి సంబంధించి రూపాయి లాభం వచ్చినా అది కొరటాలదే అని, రూపాయి నష్టం వచ్చినా, తన చేబులోంచే తీసి ఇస్తాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఫిబ్రవరి 4న ఈసినిమాని విడుదల చేయాలన్నది పూర్తిగా కొరటాల నిర్ణయమే. 2021లోనే ఈ సినిమా విడుదల చేయాల్సింది. కానీ.. అది జరగలేదు. ఈ సినిమాని హోల్డ్ చేసేకొద్దీ వడ్డీలు పెరిగిపోతాయి. అది నిర్మాతలకు అదనపు భారం. నిర్మాతలకు ఇష్టం లేకపోయినా, ఈ సినిమాని కొరటాల హోల్డ్ చేస్తూ వెళ్లాడని, ఇప్పుడు.. వాళ్లపై అదనపు భారం కల్పించకూడదన్న ఉద్దేశంతోనే… కొరటాల లాభ నష్టాల్ని తన పై వేసుకున్నాడని తెలుస్తోంది.