అనుకున్నట్టే ఆచార్య వాయిదా పడింది. మే 13న రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఆగస్టుకు వెళ్లిందంటున్నారు. అంటే.. మూడు నెలల తేడా అన్నమాట. అందరికీ తెలిసిన కారణం… కరోనా. కానీ… లోపాయకారీగా ఈ సినిమా వాయిదా పడడానికి చాలా కారణాలే ఉన్నట్టు భోగట్టా.
ఆచార్యకి సంబంధించిన సీజీ వర్క్ అవ్వలేదన్న సంగతి ఆమధ్య తెలుగు 360 బయటపెట్టింది. ఆ సీజీ వర్క్ అనుకున్న సమయానికి వస్తుందో, రాదో అనే టెన్షన్ చిత్రబృందాన్ని బాగా ఇబ్బంది పెట్టింది. అంతే కాదు.. చేయాల్సిన పని దినాలు ఇంకా చాలానే ఉన్నట్టు టాక్. రాత్రీ పగలు కష్టపడి షూటింగ్ జరిపితే గానీ, మే 13న `ఆచార్య`ని తీసుకురావడం కష్టమనుకున్నారు. అంతే కాదు.. కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయాల్సిన అవసరం కూడా వచ్చిందని టాక్. కరోనా అని కాదు గానీ, ఈ సమస్య లేకపోయినా.. ఆచార్య రిలీజ్ డేట్ వాయిదా పడేదే.. అన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఇప్పుడు కరోనాని ఓ సాకుగా చూపించే అవకాశం అయితే దక్కింది. పెద్ద సినిమాలతో వచ్చే పేచీనే ఇది. ఏదీ అనుకున్నది అనుకున్నట్టు జరగదు. మధ్యలో లెక్కలు మారుతూ ఉంటాయి. ఆచార్య విషయంలోనూ అదే జరిగింది.