వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ళ వయసుని తప్ప ఏమీ సాధించలేకపోయింది. పైగా స్వయంకృతం వల్ల కుంచింకుకుపోవడం మొదలైంది. అభిమానులే తప్పకార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులూ లేని, లేదా మిగలని పార్టీ దేశంలో ఇది తప్ప మరొకటి లేదంటే అతిశయోక్తికాదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్ధాపకుడు, అధ్యక్షుడు అయిన జగన్మోహన రెడ్డి కి పార్టీ నాయకులను సహచరులుగా చూసే అలవాటు లేదు. కోపంవస్తే అనుచరులుగా కూడా గుర్తించరు. రాజకీయ నాయకుల చుట్టూ అధికార కేంద్రాలు ఏర్పడుతాయి. కోటరీలు ఆకేంద్రాల్ని ఏలుతూ వుంటాయి. కోటరీల చెప్పుడు మాటలవల్ల తప్పటడుగులు వేసి అంకితమైన నాయకుల్ని కోల్పోయిన సందర్భాలు ప్రతీ పార్టీకీ వుంటాయి. జగన్ పార్టీకి ఆసమస్య లేదు. ఎందుకంటే ఆయన ఎవరి మాటా వినరుగనుక…ఎవరైనా ఆయన మాటే వినాలి గనుక…
జగన్ కు ప్రజాస్వామిక దృక్పధం లేకపోవడమే ఎన్నో అనుకూలతలు వున్న ఆయన పార్టీకి పురోగమనం లేకపోవడానికి మూలం. రాజకీయాల్లో ప్రత్యర్ధులే తప్ప శత్రువులు వుండరని, ఉండకూడదన్న అంశాన్ని విస్మరించిన జగన్ ఏవిషయం మీదైనా తానే యద్ధం స్ధాయిలో చంద్రబాబు మీద విమర్శలు గుప్పిస్తూ వుంటారు.
తీవ్రమైన అవినీతి ఆరోపణలు వున్న చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి లలో ప్రజలు మెచ్చిన డెమాక్రటిక్ యాటిట్యూడ్ వుండేది. తన టార్గెట్ సాధించడంలో తప్ప ఇలాంటి విలువల మీద చంద్రబాబుకి పట్టింపూ లేదు…పెద్దగా గౌరవమూ కనబడదు. ఈ విలువల గురించి జగన్ కి ఆలోచన కూడా లేదని చెప్పడానికి పెద్ద ఆలోచన అవసరంలేదు.. వుండి వుంటే ఆయన పార్టీ గొప్ప ప్రతి పక్షమయ్యేది.
తెలుగుదేశం కార్యక్రమాలను ప్రజల పెర్స్ పెక్టివ్ నుంచికాక, చంద్రబాబుతో వ్యక్తిగత శత్రుత్వమన్నట్టు వ్యవహరించడమే జగన్ మౌలిక వైఫల్యం. అధికార పార్టీని ఎదిరించడమంటే అరుపులూ కేకలూ వాకౌట్లు కాదు. ఒడుపుగా బోనులోకి లాగి ఊపిరాడకుండా చేయడమే! ఈ దిశగా పార్టీని తీసుకు వెళ్ళగలిగిన వారు జగన్ పార్టీలో వున్నారు. ”ఆయన వినడు పైగా ఎప్పుడు కోప్పడతాడో తెలియదు జరిగేదేదో జరగక మానదు” అని ఓ సీనియర్ నాయకుడు నిర్లప్తంగా చెప్పారు.
టివి మైకుల ముందు చంద్రబాబుని ఘోరంగా తిట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరిని ” మీ గురించి మరో లా విన్నాను. మీరు ఈ పార్టీ వదలరు అని అర్ధమైంది” అన్నప్పుడు ” ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏం చేస్తాం టైమొచ్చినపుడు చూద్దాం! జగన్ నిర్ణయాలు ఆకస్మికంగా వుంటాయి. లాంచనంకోసమైనా అంతర్గత చర్చ వుండదు” అని ఆ సీనియర్ ఎమ్మెల్యే చెప్పారు.
జగన్ ఒంటెత్తు పోకడలకు ఆయన తల్లీ చెల్లీ రాజకీయాల తెరమరుగైపోవడమే ఒక సాక్షి.
జగన్ నాయకత్వ వైఫల్యాల వల్లే ఆయన పార్టీ అభిమానులను దాటి ఆరేళ్ళయినా ప్రజల్లోకి వెళ్ళలేదు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు ప్రజల్లో ఇంకా జ్ఞాపకాలు గా మిగిలిపోవడమే జగన్ బలం! రాజశేఖరరెడ్డి మీద అభిమానంతో సభలకు, రోడ్ షోలకు వచ్చే ప్రజలను పార్టీకి స్ధిరమైన ఓటర్లుగా , ఓటు బ్యాంకుగా మలచుకోలేకపోయారు. బయటినుంచి వచ్చినవారు ముఖ్యనాయకులైపోయినట్టు కనిపించడం, బయటకుపోయేవారే ఆముఖ్యనాయకులై వుండటం వల్ల ఫిరాయింపుదారుల పార్టీగా ముద్రపడటం కూడా ఇమేజ్ రీత్యా పార్టీకి నష్టమే! సమస్యల్ని అధ్యయనంచేసి ఆందోళనలకు సిద్ధం చేసే వ్యవస్ధ లేకపోవడం కూడా ఆరేళ్ళు గడిచాక కూడా జగన్ పార్టీ కి లేకపోవడం పెద్దలోపమే!
ఇప్పటికైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకుని పద్ధతి మార్చుకుంటే పార్టీని పటిష్టం చేసుకోడానికి మరో మూడేళ్ళ వ్యవధి వుంది.