హర్యానా, జమ్మూకశ్మీర్‌లలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. జమ్మూకశ్మీర్‌లో హిందువులు ఉండే జమ్మూలో బీజేపీ ఘన విజయం సాధించింది. కానీ ముస్లింలు ఉండే కశ్మీర్ లోయలో మాత్రం పట్టు సాధించలేకపోయింది. కానీ ఆ ఫలితాలపై మోదీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. హర్యానాలో గెలుపు గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ వచ్చే ఏడాది కాలంలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి పెను సవాళ్లు తెచ్చి పెట్టనున్నాయి. మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ చేసిన అధికార దుర్వినియోగం, అతి రాజకీయం ఆ పార్టీకి భస్మాసుర హస్తాలుగా మారాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలిచి చాలా కాలం అయింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేసి చాలా కాలం జైల్లో ఉంచి మరోసారి గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి ఆ పార్టీలకు ఎంత నష్టం చేసిందో కానీ తన నెత్తిన చేయి మాత్రం పెట్టుకున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. బీహార్‌లో నితీష్ కుమార్ నిరంతరం టెన్షన్ పెడుతూనే ఉన్నారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ అరెస్టు వ్యవహారం బీజేపీకి చేతికి వచ్చి న అవకాశాల్ని జారవిడుచుకోవడం లాంటిదే.
అసెంబ్లీ ఎన్నికలకు .. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం ఉండదు. కానీ బీజేపీ వరుసగా అసెంబ్లీలను కోల్పోతే ఆ పార్టీ పనైపోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తి మెజార్టీ లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది. మైండ్ గేమ్ ఆడటానికి ఇలాంటి రాజకీయ పరిస్థితులు చాలు. ఎదురుదెబ్బలు తగిలినా తగలకపోయినా ఆ పార్టీ అగ్రనేతలు వదిలేయరు. వారి రాజకీయాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి.