ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎలాగైనా జైలుకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉంది. కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇచ్చిన తర్వాత అర్థరాత్రి ఆయనను హడావుడిగా డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం కలకలం రేపడంతో గందరగోళం ఏర్పడింది. చివరికి అర్థరాత్రి డిశ్చార్జ్‌ను విరమించుకున్నా.. ఏ క్షణమైనా డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కోర్టు .. ఏసీబీ విచారణ కోసం మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది. ఇలా ఇచ్చే ముందు అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వాసుపత్రి నుంచి తెలుసుకుంది. అప్పుడు అధికారులు మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉందని.. రిపోర్ట్ ఇచ్చారు.
ఆ రిపోర్ట్ ఆధారంగానే.. ఏసీబీ కోర్టు.. అచ్చెన్నాయుడుని… ఆస్పత్రిలోనే .. విచారించారని.. ఆయన మంచం మీద పడుకునే సమాధానాలు ఇచ్చినా అభ్యంతరం లేదని.. న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని ఆదేశించింది. ఇక .. అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే కస్టడీకి తీసుకుంటారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అర్థరాత్రి ప్లాన్ మార్చేశారు. ఎస్పీ ఆస్పత్రిని సందర్శించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించారు. ఆ తర్వాత ఆస్పత్రి అధికారులు డిశ్చార్జ్ పత్రం జారీ చేసేశారు. కోర్టుకు ఓ రకంగా చెప్పి.. ఇప్పుడు అప్పటికప్పుడు డిశ్చార్జ్ రాసేయడం ఏమిటన్న ప్రశ్నకు.. ఆస్పత్రి అధికారుల వద్ద సమాధానం లేదు. పై అధికారులు చెప్పారని.. తాము చేశామని సమర్థించుకుంటున్నారు.
అయితే.. పోలీసులు, ప్రభుత్వం తీరు మరో సారి చర్చనీయాంశం కావడమో.. కోర్టు ధిక్కరణ అవుతందని భయపడ్డారో కానీ… అర్థరాత్రి డిశ్చార్జ్ ప్రాసెస్‌ను నిలిపివేశారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడిని ఏసీబీ ఆస్పత్రిలోనే ప్రశ్నించాల్సి ఉంది. అర్థరాత్రి జారీ చేసిన డిశ్చార్జ్ లెటర్ ప్రకారం.. ఏ క్షణమైనా ఆయనను జైలుకు లేదా.. ఏసీబీ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారో.. లేకపోతే మనసు మార్చుకుని ఆస్పత్రిలోనే కస్టడీలోకి తీసుకుంటారో కొంత సేపట్లో తేలే అవకాశం ఉంది. ఆయనకు ఆపరేషన్ అయిందని చెప్పినా హడావుడిగా అరెస్ట్ చేసి.. ఆస్పత్రి పాలయ్యేలా చేసిన అదికార యంత్రాగం.. ఇప్పుడు… డిశ్చార్జ్ లోనూ అదే హంగామా చేస్తూండటంతో.. అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.