తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు వేయకపోయినా… రెండు, మూడేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేయడానికి అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. దీనికి కారణం.. టీడీపీ సభ్యులందరూ సస్పెన్షన్ కారణంగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వతా అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
అలాగే సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేశారు. సభలో దురదృష్టకరమైన పరిణామం ఎప్పుడూ చూడలేదని.. ప్రతిపక్ష నేత కన్ఫ్యూజన్లో పడ్డారని తమ్మినేని సీతారాం విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని హితవు పలికారు. తీర్మానం చేసినందున ఇప్పుడు స్పీకర్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో తెలంగాణ అసెంబ్లీలో గలాటా సృష్టించారని ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను స్పీకర్ మధుసూదనాచారి రద్దు చేశారు.
ఇప్పుడు.. చంద్రబాబుపైనా అలాంటి చర్య తీసుకునే అవకాశాల్ని పరిశీలించవచ్చని అంటున్నారు. అయితే పోడియం ముందు ధర్నా చేస్తేనే అనర్హతా వేటు వేస్తారా.. లేక .. రెండు మూడేళ్లు సస్పెన్షన్ వేటు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం ఇతర విషయాల్ని పట్టించుకోవడం లేదు.. చేయాలనుకున్న చేస్తోంది కాబట్టి.. ఏ చర్య తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.