అధికారంలో ఎవరున్నా ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు పేదల పాలిట పెనుశాపాలవుతున్నాయి. మండేధరలతో కనీస జీవితావసరాలు కొనుక్కోవడమే గగనమై పోతుంటే కొంత ఉపయోగపడే చౌకదుకాణాల సరఫరాలు వెనక్కు పోతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల గురించి తరచూ చెబుతుంటారు గాని ఆయన ప్రభుత్వం ఉధృతంగా రేషన్ కార్డుల ఏరివేత చేపట్టడం వల్ల నిరుపేదలకు దక్కాల్సిన బియ్యం అందకుండా పోతున్నాయి. సర్కారు మిగులు చూపిస్తుంటే పేదలు మాత్రం లబోదిబోమంటున్నారని సాక్ష్యాధారాలతో వెల్లడైంది….. నిరుపేదలు, నిరాధారులు, ఒంటరి పక్షులు, వికలాంగుల వంటివారికి 2014-15 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ి ప్రభు త్వం తెలంగాణలో 7,91,521 అంత్యోదయ కార్డులను, 16,740 అన్నపూర్ణ కార్డులను కేటాయించింది. అంత్యోదయ కార్డులకు కిలోకు రూ.1 చొప్పున 35 కిలోలు, అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వీరందరికీ అన్ని సరు కులు అందేవి. అయితే కొత్త రాష్ట్రం వచ్చాక గడచిన రెండేండ్లలో టీఆర్ఎస్ సర్కారు కార్డుల సంఖ్యను తీవ్రంగా కోత కోసింది. అంత్యోదయ 2,26,750, అన్నపూర్ణ 11,732, మొత్తం 2,38,482 కార్డులను రద్దు చేసింది. ప్రస్తుతం 2016-17లో అంత్యోదయ కింద 5,64,771, అన్నపూర్ణ 5,008 కార్డులు ఉన్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ లెక్కన కార్డుల రద్దుతో అంత్యోదయ కింద 79,36,250 కిలోలు, అన్నపూర్ణ 1,17,320 కిలోల చొప్పున మొత్తం 80,53,570 కిలోల బియ్యం మిగిలించుకొని పేదలకు శూన్యహస్తమే చూపింది. రాబోయే రోజుల్లో మరింత మందికి ఈ పరిస్థితి ప్రాప్తించవచ్చని సంకేతాలున్నాయి. ఇప్పటికే చౌక దుకాణాల్లో కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి, వంటనూనె వంటివి ఆగిపోయాయి. చింతపండు , సబ్బులు వగైరా ఆయా డీలర్లను బట్టి జరుగుతున్నాయి. త్వరలోనే నగదు బదిలీ ప్రహసనం మొదలైతే పరిస్థితి మరింతగా దిగజారవచ్చు. సిపిఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన ఈ సమాచారంపై ప్రభుత్వం ఏం చెబుతుందో గాని సరఫరాలు పునరుద్ధరించడం పేదల బతుకులకు ఆసరా అవుతుందని చెప్పకతప్పదు. వ్యాపార పారిశ్రామికవేత్తలకు కోట్లలో రాయితీలు ఇచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే సబ్సిడీలను భారంగా చూడటం సమంజసం కాదు.