జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న పరుపుల తమ్మయ్యబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలితో దుందుడుకుగా ప్రవర్తించిన వ్యవహారం వివాదాస్పదమయింది. ఈ విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ఆయన చట్టపరంగా తమ్మయ్యబాబుపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నేత అయినంత మాత్రాన ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చివరికి తమ్మయ్యబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా .. ఇలా ప్రవర్తిచే వారిని అదుపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ నేతలుగా మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పవన్ కల్యాణ్ పదే పదే కోరుతున్నారు. అయితే కొంత మంది నేతలు మాత్రం తగ్గడం లేదు. కూటమి పార్టీ నేతగా ఏం చేసినా చెల్లుతుందన్నట్లుగా ఉంటున్నారు. అయితే అలాంటి వారిని క్షమించే ప్రశ్నే లేదని పవన్ గట్టి సంకేతాలు పంపుతున్నారు.
ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే జనసేన పార్టీ అధినాయకత్వం సహించడం లేదు. డాన్స్ మాస్టర్ జానీని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్కూ అలాంటి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు తమ్మయ్యబాబును సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదన్న గట్టి సందేశాన్ని పార్టీ నేతలకు పవన్ కఠినంగా పంపుతున్నారు.