తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగరరావు స్వతహాగా వున్నది వున్నట్టు మాట్లాడే మనిషి. పెద్దరికంతో పాటు ఒకింత ఆవేశపరులు కూడా. అందుకే ఢిల్లీ మీడియా గోష్టిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విధానమే సరైందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణలో రీడిజైన్డ్ ప్రాజెక్టులకు అనుమతులు లేవన్న విమర్శలకు సమాధానంగా వైఎస్‌లాగా కట్టుకుంటూ పోవడమే మంచిదని చెప్పడం ఆయన ఉద్దేశం. అనుమతి లేకపోతే కష్టమని అప్పట్లో తాము అభ్యంతరం చెప్పడం సరికాదని ఇప్పుడు అనిపిస్తున్నదని కూడా ఆయన అన్నారు. ఎన్ని విమర్శలున్నా వైఎస్ మొదలుపెట్టిన చాలా ప్రాజెక్టులు పూర్తికావస్తున్నాయని చెప్పడం అన్నిటికన్నా పెద్ద కితాబు. అయితే రాజకీయంగా ఇది కెసిఆర్‌కు చంద్రబాబు నాయుడుకు కూడా మింగుడుపడేది కాదు. ఎందుకంటే హైదరాబాదుకు వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని వైఎస్ చేసిన వ్యాఖ్య టిఆర్ఎస్ నిరంతర విమర్శల్లో ఒకటి. పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకోవడం కోసం శ్రీశైలం జలాశయం నిల్వ మట్టం పెంచారనీ, ఖమ్మం నుంచి నీటిని తీసుకుపోవడానికి పథకం వేశారనీ, పోలవరం ఎత్తుపెంచి ముంపు విస్త్రతం చేశారని ఇలా వైఎస్‌పై టిఆర్ఎస్ బాణాలు చాలా వున్నాయి. చంద్రబాబుతో వైరం వైరుద్యం కారణంగా జగన్‌తో సాఫ్ట్ కార్నర్ వున్నా వైఎస్ విషయంలో విమర్శలు కొససాగిస్తుంటారు.ఇలాటి సమయంలో విద్యాసాగర్ ఆయననే మెచ్చుకోవడం టిఆర్ఎస్ నేతల మౌలిక విధానాలతో పొసగని అంశం. కనుకనే నమస్తే తెలంగాణ వార్తలో ఆ భాగాలు కనిపించలేదు.పైగా వైఎస్ మా సలహాలు తీసుకోలేదని ఆయన అన్నదాన్నే ఇచ్చారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే జలయజ్ఞం ధనయజ్ఞం అయిందనేది ఆ రోజుల్లో బి.వి.రాఘవులు ప్రారంభించిన పెద్ద విమర్శ. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో నీటిపారుదలకు ప్రాధాన్యత నివ్వలేదు గనకే వైఎస్ చొరవకు స్పందన వచ్చింది. అవినీతి ఆరోపణలు ఎలా వున్నా కొన్నయినా కొంతైనా కదలిక వచ్చింది. ఇప్పుడు పొరుగురాష్ట్ర ప్రముఖులే దాన్ని ప్రశంసిస్తే రాజకీయంగా అది జగన్‌కు కలసి వచ్చే అంశమవుతుంది. అందుకు తగినట్టే సాక్షి ఈ భాగాన్ని చాలా ప్రముఖంగా ప్రచురించుకుంది.
నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ తెలుగుగంగ పథకంతో సహా చాలా వాటిని ముందస్తు అనుమతి లేకుండానే ప్రారంభించారు. కర్ణాటక అల్మట్టి అయినా అంతే. బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలను వాడుకునే అవకాశం మనకే ఇచ్చింది గనక ప్రాజెక్టులు త్వరితంగా పూర్తిచేసుకోవాలని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సుందరయ్య వంటి వారు నిరంతరం ఘోషిస్తూ వచ్చారు.గోదావరి జలాలే నిజమైన పరిష్కారం గనక ఇచ్చంపల్లి పూర్తి చేయాలని ఆయన వివరంగా చెప్పడం నాకు గుర్తుంది.అయితే కాంగ్రెస్ తెలుగుదేశం పాలకులు వాటిపై సరైన శ్రద్ద పెట్టలేదు గనక ఈలోగా పై రాష్ట్రాలు చకచకా రిజర్వాయర్లు బ్యారేజీలు కట్టేసుకున్నాయి. ఇప్పుడు ఎపికి తెలంగాణ కూడా ఎగువ రాష్ట్రమై పోయింది.వివాదాలు పెరిగాయి.ఇలాటి తరుణంలో విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు కొన్ని వాస్తవాలకు అద్దం పట్టాయి. అయితే రాజకీయంగా టిఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టాయనిచెప్పొచ్చు. కోదండరాం వంటివారు కూడా తమతో వుండి ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చారని ఆయన చేసిన విమర్శ కూడా తీవ్రమైందే.ఇక ఇంజనీరింగ్ నిపుణుడు హన్మంతరావుపై వ్యాఖ్యలు వృత్తిపరమైన తేడాలతో పాటు కొంత కోపాన్ని కూడా చూపించాయి.