ఎపి తెలంగాణ ముఖ్యమంత్రులు ద్వితీయ శ్రేణి నాయకుల పట్ల ఆశావహుల పట్ల అనుసరిస్తున్న వ్యూహం తమాషాగా వుంది. రెండు రాష్ట్రాల్లోనూ మంత్రివర్గ విస్తరణలు జరగలేదు. నామినేటెడ్ పదవుల పంపకం కూడా పాక్షికంగానే జరిగింది. వాటికోసం ఎదురు చూసేవారి సంఖ్య చాలా వుంది. ఎవరికి వారు తమ’కేసు’చెప్పుకోవడానికి తంటాలు పడుతుంటారు. పదిమందిలో చెప్పలేరు, విడిగా కలిసే అవకాశం రాదు. ఎలాగైనా అపాయింట్మెంట్ కోసం అల్లాడిపోతుంటారు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా ఎక్కువమందిని కలుసుకుని నిముషమో అర నిముషమో వింటారు. అదే కెసిఆర్ విషయానికి వచ్చే సరికి సెక్యూరిటీ ప్రొటోకోల్ సిబ్బంది ద్వారానే కథ నడిపిస్తుంటారు. ప్రజా ప్రతినిధులు హేమాహేమీలనుకునేవారు కూడా దర్శనం దొరక్క ఎడతెగని నిరీక్షణలో గడుపుతుంటారు. అయితే చురుకైన వారిగానో లేక మంచివారిగానో ఆయన దృష్టిలో వున్నవారిని ఎలాగోలా సంతృప్తి పర్చేందుకు కెసిఆర్ ఆతిథ్య వ్యూహం ఎంచుకుంటారు. అడపాదడపా వారిని పలహారానికో భోజనానికో ఆహ్వానిస్తారు. కాస్త సమయం ఇచ్చి మాట్లాడతారు. అందరి ముందు పక్కన కూచోబెట్టుకుంటారు. లేదంటే సమావేశానికి ఫలానా వారిని రమ్మని పిలవండని పురమాయిస్తారు. మరీ ఇష్టమైతే రోజంతా తనతో పాటు వుండమంటారు. చివరలో వారు మనసులో మాట చెప్పే అవకాశం కూడా రావచ్చు రాకపోవచ్చు.కాని తము ఆయన దృష్టిలో వున్నామనే తృప్తితో వెళ్లిపోతారు. మళ్లీ మామూలే! ఇంచుమించు ఇలాటి పద్ధతినే చంద్రబాబు కూడా కాస్త తక్కువ స్థాయిలో అమలు చేస్తున్నారు. కాకపోతే ఆయన సామూహిక సంప్రదింపులు జరపడం అవతలివారు చెప్పింది ఆలకించినట్టు అభిప్రాయం కలిగించడం అలవాటు. పదవులకు సంబంధించి మాత్రం తాను అనుకున్నవారిని తొందరపడవద్దని భరోసా ఇస్తుంటారు. మిగిలినవారికి నా దృష్టిలో వుంది అని చెప్పి సంతృప్తిపరుస్తుంటారు.