సినీ నటుడు అలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలీకి చెల్లించే జీతభత్యాల గురించి విడిగా ఉత్తర్వులు ఇస్తామని జీవోలో చెప్పారు. అయితే సలహాదారులకు సహజంగా.. రూ. మూడు లక్షల వరకూ అందుతాయి. అదనంగా కొన్ని అలవెన్స్‌లు వస్తాయి.ఏపీ ప్రభుత్వానికి ఉన్న లెక్క లేనంత మంది సలహాదారుల్లో చాలా మందికి అవే వస్తాయి. వారి జాబితాలో అలీ కూడా చేరిపోయారు. రాజకీయంగా ఎలాంటి పదవులు ఇవ్వలేని వారికి ప్రజాధనం ఇలా ముట్టచెబుతూ సలహాదారుల పదవి ఇవ్వడం ఆనవాయితీగా వైసీపీ పెద్దలు పెట్టుకున్నారు. ఈ కోటాలోనే అలీకి పదవి దక్కినట్లుగా తెలుస్తోంది.
సినీ నటుడు అలీ ఎమ్మెల్యే అయిపోదామని రాజకీయాల్లోకి వచ్చారు. ఆప్తమిత్రుడు పవన్ కల్యాణ్‌ను.. మిత్రుల సాయంతో పొందిన టీడీపీ అధినేత ప్రాపకాన్ని కాదని… ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయన లెక్క ఎమ్మెల్యే టిక్కెట్ నుండి ప్రారంభమైంది… ఓ దశలో ఆశలు రాజ్యసభ సీటు వరకూ వెళ్లాయి. జగన్ మోహన్ రెడ్డి ఓ సారి ప్రత్యేకంగా పిలవడంతో సతీమణి సమేతంగా డిజైనర్ దుస్తుల్లో వెళ్లి జగన్‌ను కలిశారు. వారంలో గుడ్ న్యూస్ చెబుతామన్నారు.ఆ వారం ఇప్పటికి అయింది. అయితే ఆ గుడ్ న్యూస్ రాజ్యసభ లేకపోతే వక్ఫ్ బోర్డ్ చైర్మనో కాదు.. కేవలం సలహాదారు పదవి.
రెండేళ్ల పదవీ కాలం అని ప్రకటించారు కానీ.. ప్రభుత్వానికి ఇంకా అంత సమయం లేదు. ఏడాదిన్నర మాత్రమే ఉంది. ప్రభుత్వం మారితే సలహాదారుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు. పొరపాటున ఏమైనా సలహాలిచ్చుంటే అందులో తేడాలను కనిపెడితే… వైసీపీ చేసిన వేధింపుల ప్రభావం ఆయనపై పడుతుంది. అదే సమయంలో ఇప్పుడు పదవి ప్రకటించడం వల్ల.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అసెంబ్లీ టిక్కెట్ కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక పదవి రాని టాలీవుడ్ వైసీపీ ఫ్యాన్ పోసాని ఒక్కరే అవుతారు. ఆయనకూ ఓ సలహాదారు పదవి ఇస్తారేమో చూడాలి.