ఈమధ్య అలీ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. నవా కమిడియన్ల హవా ఎక్కువవ్వడం ఒక కారణమైతే, రాజకీయంగా కొంతమంది నిర్మాతలకు, హీరోలకూ దూరమయ్యాడు అలీ. అలా.. తన స్పీడు బాగా తగ్గింది. ఎట్టకేలకు అల్లు శిరీష్ సినిమా ‘బడ్డీ’లో నటించాడు. ఈ సినిమా ఈనెలలోనే విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చాడు అలీ. చిత్రబృందంతో కలిసి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టాడు. ప్రతీ ఇంటర్వ్యూలోనూ అలీకి కామన్ గా కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అవన్నీ పవన్ కల్యాణ్ గురించే. రాజకీయంగా పవన్‌తో విబేధించడం, ఈ ఎన్నికల్లో జనసేన 100 % స్ట్రయిక్ రేట్ తో విజయం అందుకోవం… ఈ విషయాలపై అలీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ‘రాజకీయాలు ఇప్పుడు వద్దు.. వదిలేశాగా’ అని ముక్తసరిగా సమాధానం చెప్పడం కనిపించింది. అంతే కాదు… ఇంటర్వ్యూ ప్రారంభించేటప్పుడే ‘ఇది కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే. వ్యక్తిగత ప్రశ్నలు వద్దు’ అని గట్టిగా చెప్పేస్తున్నాడు. దాంతో పవన్ ప్రశ్నల పరంపర నుంచి తప్పించుకొంటున్నాడు.
అయితే అలీ వీటికి ఎక్కడో ఓ చోట సమాధానం చెప్పక తప్పదు. ఎక్కడో ఓ చోట వీటికి బ్రేక్ వేయాలంటే అలీ నోరు విప్పాలి. పవన్ పై స్పందించడానికి అలీకి ఇప్పుడున్న ఇబ్బంది ఏమిటో అర్థం కాదు. తను వైకాపాలో లేడు. ఓ సినిమా నటుడిగా పవన్ విజయాన్ని ఒప్పుకొంటే గౌరవంగా, హుందాగా ఉండేది. ఈ టాపిక్ ఇక్కడితో ఆగిపోయేది. అలీ తప్పించుకొనేకొద్దీ ఈ ప్రశ్నల వరద కొనసాగుతూనే ఉంటుంది. అలీకీ, పవన్‌కీ మధ్య మంచి స్నేహం ఉండేది. ఓ స్నేహితుడిగా పవన్ విజయాన్ని ఒప్పుకొంటే హుందాగా ఉండేది. అలీ రాజకీయాలకు దూరమైనంత మాత్రాన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకొంటే ఎలా..? పైగా అలీ చాలా తెలివైన వాడు. లౌక్యం తెలిసినవాడు. తను ఇలా తప్పించుకొని తిరగడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.