ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. వివరాల్లోకి వెళితే…
తెలుగు తెరమీద , ఆ మాటకొస్తే భారతదేశంలోనే మహిళా దర్శకులకు గుర్తింపు తెచ్చిన దర్శకురాలు విజయనిర్మల. సుమారు 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ లో ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు. . తన దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం మీనా. ఆ మధ్య త్రివిక్రమ్ తీసిన అఆ సినిమాకు మాతృక మీనా సినిమా. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన విజయనిర్మల 200కి పైగా సినిమాలలో నటించారు. పాండురంగ మహత్యం సినిమా తో 11వ ఏటనే బాలనటిగా తెరంగేట్రం చేసిన విజయనిర్మల , రంగులరాట్నం సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. దాదాపు 50కి పైగా సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించారు. దర్శకురాలిగా, నటి గానే కాకుండా నిర్మాతగా కూడా విజయనిర్మల వ్యవహరించారు. దాదాపు 15 సినిమాలను తన సొంత బ్యానర్ అయిన విజయకృష్ణ బ్యానర్ పై నిర్మించారు.
నటుడు నరేష్ కి విజయనిర్మల తల్లి. తెలుగు తెరకు విజయనిర్మల లేని లోటు తీర్చలేనిది.