స్వతంత్రంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నానని ప్రకటించిన సినీనటుడు ప్రకాష్ రాజ్… భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు… స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. జనవరి ఒకటో తేదీన తన కొత్త సంవత్సర నిర్ణయంగా రాజకీయ రంగ ప్రవేశం గురించి ట్వీట్ చేసిన ఆయన ఐదు రోజుల వ్యవధిలోనే పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. విలక్షణ నటనతో సినిమాల ద్వారా.. దక్షిణాది మొత్తానికి.. చిరపరిచితమైన ప్రకాష్‌రాజ్.. రాజకీయ రంగ ప్రవేశానికి సొంత రాష్ట్రాన్నే చాయిస్‌గా ఎంచుకున్నారు. ఆయన తన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీనే భావిస్తున్నారు.
బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గా బీజేపీకి కంచుకోట లాంటిది.. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ.. అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. బెంగళూరులో విద్యాధికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. వాళ్లెవరూ పార్టీలను చూడరని… వ్యక్తులను చూసి ఓట్లేస్తారని ప్రకాష్ రాజ్ నమ్ముతున్నారు. అందుకే బెంగళూరు సెంట్రల్ ను ఎంచుకున్నారు. కొన్నాళ్ల నుంచి.. భారతీయ జనతా పార్టీ విధానాలు, నరేంద్రమోడీ తీరుపై.. విమర్శలు గుప్పిస్తున్న ప్రకాష్ రాజ్ ను తమ పార్టీలోకి తీసుకుని టిక్కెట్ ఇవ్వడానికి దక్షిణాదిలోని కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా.. ఈ విషయంలో.. ఓ సందర్భంలో ప్రకాష్ రాజ్‌కు ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం జరిగింది. రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన చేసిన తర్వాత ప్రకాష్‌రాజ్ కేటీఆర్‌ను కూడా కలిశారు. ఆ తర్వాత నియోజకవర్గాన్ని ప్రకటించారు.
బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో.. ఈ ఎనిమిదింటిలో.. ఐదు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మూడు స్థానాల్లోనే బీజేపీ విజయం సాధించింది. ఈ సారి కాంగ్రెస్, జేడీఎస్ కలసి పోటీ చేస్తే సునాయాస విజయం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రకాష్ రాజ్.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.