అరె జగనూ.. నీకు మానవత్వం లేదురా.. అని ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ .. పూర్తిగా బలైపోయిన తర్వాత ఇక బయటకు రాని విధంగా కూరుకుపోయిన తర్వాత నిస్సహాయంగా అన్నారు. అయితే ఇది ఆయన తన రాజకీయ జీవితం గురించి అనలేదు. ఓ వెబ్ సీరీస్లో తన క్యారెక్టర్ కు సరిపోయేలా ఉన్న డైలాగులు అవి. ఎపిసోడ్లో వాటినే హైలెట్ చేయడంతో .. ఇవి సమకాలిన రాజకీయాలకు సరిపోయేలా ఉండటంతో వైరల్ అవుతోంది.
‘జీ 5’ ఓటీటీలో ‘ఏటీఎం’ వెబ్ సిరీస్ విడుదలైంది. అందులో రాజకీయ నాయకుడిగా పృథ్వీ నటించారు. ఎమ్మెల్యే కావాలని ఆశపడే కార్పొరేటర్ రోల్. పేరు గజేంద్ర. హీరోగా ‘బిగ్ బాస్ 5’ ఫేమ్ సన్నీ నటించారు. ఆయన క్యారెక్టర్ పేరు జగన్. ఈ జగన్ .. ఎమ్మెల్యే్ను చేస్తానని ఆశపెట్టి.. గజేంద్రను ఓ కేసులో ఇరికిస్తాడు. ఇక బయటకు రాలేనని తేలిన తర్వాత గజేంద్ర ”ఒరేయ్ జగనూ… నీకు మానవత్వం లేదురా” అని దీనంగా చెబుతాడు.
ఎస్వీబీసీ చైర్మన్ గా ఉండి.. ఫృధ్వీ కూడా తాను అలాంటి కుట్రకే బలయ్యానని బయట చాలా సార్లు చెప్పుకున్నారు. అందుకే ఈ డైలాగులు వైరల్ అవుతున్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు పృథ్వీ జగన్ కోసం ఇతర పార్టీ నేతలను దూషించేవారు. వైసీపీని వీడిన తర్వాత పృథ్వీ గతంలో విమర్శలు చేసిన వాళ్ళకు క్షమాపణలు చెప్పారు. జగన్ మీద విమర్శలు చేశారు. ఇప్పుడు వెబ్ సిరీస్లో కొనసాగించారు. నిజానికి అసలు వెబ్ సిరీస్కు ఏపీ రాజకీయాలకు సంబందం లేదు. అది పూర్తిగా ఫిక్షన్.. అయినా ఎక్కడో సిమిలారిటీ కనిపించడంతో వైరల్ అవుతున్నాయి.