2019 ఎన్నికల సమయంలో వైసీపీకి టాలీవుడ్ నుంచి పెద్దలెవరూ ప్రచారం చేయలేదు కానీ .. చిన్న కమెడియన్ల గుంపు మాత్రం .. యాక్టర్ ఫృధ్వీ నేతృత్వంలో విస్తృతంగా ప్రచారం చేసింది. కనీసం ఇరవై మంది కమెడియన్లు విస్తృతంగా ప్రచారం చేశారు. వారికి చివరి క్షణంలో పార్టీలో చేరిన అలీ, మోహన్ బాబు జత కలిశారు.. ఇప్పుడు వీరిలో ఒక్క అలీ మాత్రమే ఉన్నారు. ఆయన టిక్కెట్ రేసులో ఉన్నారు. టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన కూడా ప్రచారం చేస్తారో లేదో తెలియదు.
యాక్టర్ ఫృధ్వీ ఇప్పడు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తన టీమ్ ను రెడీ చేసుకుంటున్నారు. సిక్కోలు నుంచి శ్రీకాళహస్తి వరకూ అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ నేతల బండారం బయటపెడతానని ఆయన అంటున్నారు. లోకేష్ రెడ్ డెయిరీని ప్రిపేర్ చేసుకున్నారని తాను పీఆర్ డెయిరీని ప్రిపేర్ చేసుకున్నానని చెబుతున్నారు. అందులో ఉన్న వివరాలు నియోజకవర్గాల వారీగా బయటపెడతానంటున్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు ప్రజల్ని దోచుకున్నారని ఫృధ్వీ అంటున్నారు.
ఫృధ్వీ జగన్ రెడ్డి కోసం ప్రచారం చేసినప్పుడు కన్నూ మిన్నూ కానరాకుండా విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్, మెగా కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారు. టీడీపీ నేతల్ని. చంద్రబాబునాయుడ్నీ వదిలి పెట్టలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఆయనకు అర్థమైంది. ఓ పదవి ఇచ్చి.. ఆయనను లైంగిక వేధింపుల కేసులో ఇరికించి బయటకు గెంటేశారు. తన వెనుక జరిగిన కుట్రను తెలుసుకున్న తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయింది. అప్పట్నుంచి సినిమాకెరీర్ కోసమైనా సరే మెగా ప్యామిలీని పొగుడుతూ.. వైసీపీని తిడుతూ వస్తున్నారు. కానీ ఇంత వరకూ ఆయనను జనసేనలో అధికారికంగా చేర్చుకోలేదు.