టాలీవుడ్ నటుడు రఘుబాబు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదవశాత్తు బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రమాదం జరిగాక బైక్ ను కారు దాదాపు 50మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు. మృతుడు నల్గొండ జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్ధన్ రావు బీఆర్ఎస్ నాయకుడిగా తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్న సమయంలో బైక్ పై జనార్ధన్ రావు ఇంటికి వెళ్తుండగా…హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తూ స్వయంగా కారును నడుపుతున్న రఘుబాబు జనార్దన్ రావు ద్విచక్ర వాహనాన్ని వెనక వైపు నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటన నల్గొండ బైపాస్ రోడ్డుపై చోటుచేసుకుంది.
జనార్ధన్ రావుకు బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. జనార్ధన్ రావు భార్య ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.