ప్రముఖ తెలుగు సినీ నటుడు రంగనాద్ (70) శనివారం మరణించారు. సికిందరాబాద్ లోని కవాడీగూడా అనే ప్రాంతంలో గల ఆయన స్వగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కనుగొన్నారు. ఆయన ఎంతో అమితంగా ప్రేమించే భార్య కొన్ని నెలల క్రిందటే అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుండి ఆయన తీవ్రమానిస్క వేదన అనుభవిస్తున్నట్లు, జీవితంపై విరక్తితో మాట్లాడుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కనుక ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చనే అనుమానంతో బందువులు పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాద్. ఆయన 1949లో చెన్నైలో జన్మించారు. ఆయన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీఏ చేసారు. కొన్ని సం.లు రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసారు. ఆయన 1969లో తన మొట్ట మొదటి సినిమా బుధ్దిమంతుడుతో సినీరంగ ప్రవేశం చేసారు. అప్పటి నుండి సుమారు 300కి పైగా సినిమాలలో ఆయన విభిన్న పాత్రలలో నటించి ప్రజలను మెప్పించారు. 1977లో విడుదలయిన పంతులమ్మ సినిమా ఆయనకి గొప్పపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దేవతలారా దీవించండి, తాయారమ్మ బంగారయ్య, ఇంటింటి రామాయణం, మావూరి దేవత, ఈ చరిత్ర ఏ సిరాతో, విశ్వనాధ నాయకుడు వంటి అనేక సినిమా పేర్లు చెప్పగానే అందులో ఆయనే గుర్తుకు వస్తారు. మొగుడ్స్-పెళ్లామ్స్ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. శాంతి నివాసం, ఇద్దరు అమ్మాయిలు అత్తో అత్తమ్మ కూతురో తెలుగు టెలీ సీరియల్స్ కూడా నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.