ఏపికి ప్రత్యేక హోదాపై గల్లీ నుంచి డిల్లీ వరకు అనేక మంది ఉద్యమాలు చేస్తున్నారు కానీ ఎవరి ఉద్యమం వారిదే అన్నట్లుగా సాగుతోంది. దాని కోసం ఈనెల 10న వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడించి ధర్నాలు చేయబోతోంది. హోదా కోసం విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. దాని కోసం ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ప్రస్తుతం అనంతపురంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. కేంద్రంతో స్నేహంగా ఉంటూనే ప్రత్యేక హోదా సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు కనుక ఇంకా దానిపై తెదేపా చేయబోయదేమీ లేదని స్పష్టం చేసినట్లే భావించవచ్చు. చలసాని చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించిన నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ భాజపా, కేంద్ర ప్రభుత్వం చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు. భాజపాని ఒకప్పుడు అధికారంలో తీసుకువచ్చిన లాల్ కృష్ణ అద్వానీనే పక్కనపెట్టేసిన మోడీ, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను పక్కనబెట్టడం పెద్ద విచిత్రమేమీ కాదని నటుడు శివాజీ అన్నారు. ఇదివరకు రాష్ట్ర ప్రజల వేడ్కోళ్ళను పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా, రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా బుద్ధి చెప్పారో, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పితే భాజపాకి కూడా వచ్చే ఎన్నికలలో అదేవిధంగా బుద్ధి చెపుతారని శివాజీ హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం కొనగుతూనే ఉంటుందని అన్నారు. ఈసారి శివాజీ తాము చేస్తున్న ఈ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ మద్దతు కోరకపోవడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఇదివరకు ఎన్నిసార్లు కోరినా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో, ఇంక ఆయనను వేడుకోవడం అనవసరమని భావిస్తున్నారేమో?
కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈనెల 13న రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంపిలు అందరూ ఆ రోజు విధిగా సభకు హాజరయ్యి ఆ బిల్లుకి మద్దతు తెలపాలని కాంగ్రెస్ పార్టీ ఒక విప్ జారీ చేయబోతున్నట్లు ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పారు. అది మంచి ఆలోచనే. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో చేర్చలేదు కనుకనే ఇవ్వలేకపోతున్నామని తప్పించుకొంటున్న మోడీ ప్రభుత్వం, ఆ బిల్లుని వ్యతిరేకిస్తే తన హామీని అమలుచేయడం ఇష్టం లేదని, అందుకే అది ఈ కుంటిసాకు చెపుతున్నట్లు కూడా రుజువవుతుంది.