పార్లమెంటు సమావేశాలు మొదలవగానే ఏపిలో నేతలందరి నోట తప్పకుండా వినిపించే మాట ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా సాధన సమితి నేత, నటుడు శివాజీ కూడా దాని గురించి మాట్లాడారు. “ఈనెల 22న పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. కానీ దానిని అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇకనైనా తెదేపా ప్రత్యేక హోదాపై తన వైఖరి స్పష్టం చేయాలి. ఆ బిల్లుపై ఓటింగ్ జరిగితే తెదేపా సభ్యులు కూడా దానికి అనుకూలంగా ఓటు వేయాలి. లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందే నేను ఆత్మహత్య చేసుకొంటాను. ప్రత్యేక హోదా సాధించకుండా రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల కోసం ఎన్ని దేశాలు తిరిగినా ప్రయోజనం లేదని ముఖ్యమంత్రి గ్రహించాలి. కనుక ఆయనే స్వయంగా దీని కోసం పోరాటం ప్రారంభిస్తే బాగుటుంది,” అని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం శివాజీ చాలా రోజులుగా పోరాటం చేస్తున్నా, ప్రజలు ఆయనని పట్టించుకోవడం లేదు. అందుకే ఆయన ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించమని పవన్ కళ్యాణ్ న్ని కోరారు. కానీ ఆయన కూడా పట్టించుకోలేదు. ప్రత్యేక హోదాని మంజూరు చేయవలసిన భాజపా, సాధించవలసిన తెదేపా రెండూ కూడా దానిపై దాగుడుమూతలు ఆడుతున్నందున, అది ఇక సాధ్యం కాదనే సంగతి ప్రజలకి అర్ధమైంది. పైగా రాజకీయ పార్టీలకి ప్రత్యేక హోదా ఒక ఆటగా మారిపోయిందని ప్రజలు భావించడం చేతనే వారు కూడా దానిపై ఆసక్తి చూపడం లేదు. అందుకే ప్రజలు శివాజీకి, జగన్మోహన్ రెడ్డికి సహకరించలేదు. ప్రజలు సహకరించకపోవడంతో శివాజీ వంటివారు కూడా తమ ఉనికిని చాటుకొనేందుకే దాని గురించి మాట్లాడటం అలవాటు చేసుకొన్నట్లున్నారు.