తెలుగు చిత్రసీమ అందాల నటుడు శోభన్ బాబు కొత్తగా పరిచయం ఆవసరం లేని వ్యక్తి. ఆయన 2008, మార్చి 20వ తేదీన మరణించారు. అప్పటి నుండి అభిమానులు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఇన్నాళ్ళకు ఫలించాయి. విజయవాడలోని గాంధీనగర్ సెంటర్లో దివంగత నటుడు శోభన్‌బాబు విగ్రహాన్ని అభిమానులు ఏర్పాటు చేశారు. దీనిని తూర్పు గోదావరికి జిల్లాకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడియార్ తయారు చేసారు. రాజమండ్రి ఎంపి మురళీమోహన్, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కలసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, నగరంలోని ‘ఆంధ్రపత్రిక సెంటర్’కి శోభన్ బాబు పేరు పెట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే శోభన్ బాబు పేరిట సినిమా అవార్డు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. మురళీ మోహన్ తన సినీ జీవితంలో శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని, నేటి తరం నటీనటులు కూడా ఆయనలాగే క్రమశిక్షణ అలవరచుకొంటే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు అభిమానులు, ఎమ్మెల్యేలు ఉమామహేశ్వరరావు,రామ్మోహన్ రావు ఇంకా చాలా మంది ప్రజలు పాల్గొన్నారు.