సినీ నటుడు శివాజీని పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. టీవీ9 అమ్మకం వివాదంలో… అలంద మీడియా చేసిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు.. శివాజీపై కేసు నమోదు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అయితే శివాజీ మాత్రం.. వాటిని పట్టించుకోలేదు. గతంలో ఓ వీడియో రిలీజ్ చేసి.. పోలీసులు అక్రమ కేసులు పెట్టారని.. అసలు.. తనకు, రవిప్రకాష్‌కు మధ్య జరిగిన లావాదేవీలపై ఇతరులు కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు.. ఆజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో దిగినట్లు సమాచారం రావడంతో.. పోలీసులు వెంటనే అలర్ట్ అయి.. అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి.. కొన్నాళ్ల కిందట… శివాజీ.. తనను పోలీసులు అక్రమంగా కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తూ.. ఆ కేసులను కొట్టి వేయాలని కోరుతూ.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనను పోలీసులు ముందస్తు అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. శివాజీకి వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు తీసుకోరాదని ఆదేశించారు. ఆ ఆదేశాలను జూలై 9 వరకు పొడిగిస్తూ విచారణను వాయిదా వేసింది. అయినప్పటికీ.. పోలీసులు శివాజీని ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. శివాజీని అరెస్ట్ చేయలేదని.. చేయబోమని పోలీసులు చెబుతున్నారు. విచారణకు సహకరించాలని కోరుతామనే చెబుతున్నారు. కానీ.. నిజానికి ఆయనను ఎయిర్ పోర్టు నుంచి బలవంతంగా పోలీసులు తీసుకెళ్లారు.
టీవీ9 అమ్మకాన్ని వివాదాస్పదం చేసేందుకు రవిప్రకాష్‌తో ముందస్తు తేదీలతో.. కలిసి.. తెల్ల కాగితం మీద… ఫేక్ ఒప్పందం చేసుకున్నారనేది…శివాజీపై ఉన్న అభియోగం. ఆ నకిలీ పత్రాలతోనే… శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో కేసు వేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో.. రవిప్రకాష్ పై అలంద మీడియా పెట్టిన ఫోర్జరీ కేసు, నిధుల దుర్వినియోగం వంటి అంశాల్లోనూ.. శివాజీ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు.. విచారణ కోసం ఆయనకు నోటీసులు జారీ చేసినా హాజరు కాలేదు. చివరికి అదుపులోకి తీసుకున్నారు.