ఎవరైనా ఒక ప్రముఖుడు రాజకీయాల్లోకి రాబోయే ముందు చెప్పే పరమ రోత రొటీన్ మాట ఏంటంటే… ‘ప్రజాసేవ కోసం వస్తున్నాననీ, ఇక్కడైతే ఎక్కువమందికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందనీ’! ఇది వినీవినీ జనాలకు చెవులు తప్పు పట్టేసినా.. ఇదే మాట చెబుతూ చాలామంది పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. జనాల్ని కొన్ని కోట్ల ఓట్లుగా మాత్రమే చూసే నాయకులున్న రోజులవి. కులాల్ని ఓటు బ్యాంకులగా కళ్లకద్దుకునే కాలం ఇది! అందుకే, ఇప్పుడు కొత్తగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖులు… ‘మా సామాజిక వర్గానికి సేవ చేసుకోవడం కోసం వస్తున్నా’ అంటూ కొత్త ప్రకటనలు చేస్తున్నారు. ప్రముఖ నటుడు సుమన్ ఇలాంటి మాట అన్నారు!!
2019 ఎన్నికల్లో తాను తప్పనిసరిగా పోటీ చేస్తా అంటూ ప్రకటించారు నటుడు సుమన్. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తాను వెనకబడిన సామాజిక వర్గానికి చెందినవాడనీ, బీసీలకు సేవచేయాలన్న ధృడ సంకల్పంతో ఉన్నాననీ, అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్దేశంతోనే గత కొన్నాళ్లుగా బీసీలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అన్నారు. నటుడిగా ఉన్నప్పుడు కొంతమందికి మాత్రమే సేవ చేశాననీ… రాజకీయాల్లో వస్తే ఎంతోమందికి సేవ చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఇటువైపు వస్తున్నట్టు సుమన్ అభిప్రాయడ్డారు. లక్ష్య సాధన కోసం పోరాటం చేస్తానని చెప్పారు!
రాజకీయాల్లో ఓనమాల దిద్దకముందే కులం ప్రస్థావన ఏంటీ సుమన్జీ! ఒక సామాజిక వర్గానికి మాత్రమే సేవ చేసేందుకు మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా..? అంటే, వేరేవాళ్లకు సేవ చెయ్యరా.? బీసీలు ఒక్కరే ఓట్లేస్తే చాలని లెక్కలు కట్టుకుని బయలుదేరారా..? ఇప్పటికే జనాల్ని ఓటర్లు మాత్రమే చూస్తున్న కొంతమంది నాయకుల్ని భరిస్తున్నాం. వారు చేస్తున్న సేవల్నీ చూసి తరిస్తున్నాం! కులం పేరుతో కొట్లాటలు అనుభవిస్తున్నాం. కొంతమంది మధ్య గొడవలు పెట్టడానికి తప్ప… ఐకమత్యం పెంచేంత శక్తిలేని ‘కులం’ గురించి ఎవరైనా ఎందుకు మాట్లాడాలి? అయినా, ఓం ప్రథమం అంటూ కులం కార్డుతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమేంటీ..? వేరే ప్రజా సమస్యలు లేవా..? వాటిపై పోరాటం చేసేందుకు వస్తున్నా అంటే… కనీసం జనం నమ్మినట్టైనా నటించి తప్పట్లు కొడతారుగా! మీ లక్ష్యం ప్రజాసేవే అయినప్పుడు 2019 వరకూ ఆగాల్సిన పనేముంది..? ఈలోపు రాహుకాలాలూ, ఏటినాటి శని ప్రభావాలూ, గ్రహాల వక్ర దృష్టీ లాంటివి ఉన్నాయా..? ఎమ్మెల్యే టిక్కెట్టో, ఎంపీ సీటో వచ్చేంత వరకూ ప్రజలకు సేవలు చేయకూడదనే రూల్స్ ఏమైనా పెట్టుకున్నారా..?
సమాజంలో పౌరులందరూ సమానమే. కుల మత ప్రాంత వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందర్నీ సమానంగా చూడగిలే దేశం మనది అని గొప్పగా రాజ్యాంగంలో రాసుకున్నాం. రాజకీయాల్లోకి వచ్చేముందు కనీసం ఆ ఒక్క వాక్యాన్నైనా చదువుకుని రండి..! దయచేసి.. ప్రజాసేవ పేరుతో ప్రజలని.. కులాలుగా, సమూహాలుగా, ఓటరు జాబితాలో కొన్ని పేర్లుగానో, మీ జెండాలు మోసే కర్రలుగానో, మాత్రం చూడకండి.. ప్లీజ్!