బెంగళూరు రేవ్ పార్టీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలిసుల విచారణకు టాలీవుడ్ నటి హేమ డుమ్మాకొట్టారు. తాను విచారణకు హాజరు కాలేనని తాజాగా పోలీసులకు లేఖ పంపారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు పేర్కొన్న హేమ విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని బెంగళూరు సీసీబీకి లేఖ రాసింది. అయితే, ఆమెకు మరో నోటీసు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
ఈ నెల 19న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో 150మంది పాల్గొన్నారు. అందులో 103మంది రక్త నమూనాలను నార్కోటిక్ బృందం సేకరించగా 86మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఇందులో హేమ పేరు కూడా ఉంది. దీంతో డ్రగ్స్ పాజిటివ్ అని తేలిన వారందరూ సోమవారం విచారణకు హాజరు కావాలని సీసీబీ నోటీసులు ఇచ్చింది.
అయితే, ఈ విచారణకు హేమ హాజరు అవుతుందా.. లేదా అనే అనుమానాలు మొదట్లోనే వచ్చాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ హేమ నేటి విచారణకు డుమ్మా కొట్టారు. తాను విచారణకు హాజరు కాలేనని లేఖ రాయగా.. హేమపై సీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది.