ప్రముఖ మలయాళీ నటి కల్పనా రంజని (50) సోమవారం హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె నాగార్జున-కార్తి కలిసి నటిస్తున్న ‘ఊపిరి’ సినిమాలో ఓకే ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు. ఈరోజు ఆమె హైదరాబాద్ లో ఆ సినిమా షూటింగ్ కోసం వచ్చి ఒక హోటల్లో బస చేసి ఉన్నప్పుడు ఆమెకు చాలా తీవరంగా గుండెపోటు వచ్చింది. హోటల్ సిబ్బంది ఆమెను తక్షణమే జూబ్లీ హిల్స్ లో గల అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించారు.
కల్పనా రంజని అనేక తెలుగు, తమిళ, మళయాళ సినిమాలు చేసారు. తెలుగులో ప్రేమ, సతీ లీలావతి, బ్రహ్మచారి మొదలయిన సినిమాలలో నటించారు. ఆమె అక్టోబర్ 5, 1965న కేరళ నాటక రంగానికి చెందిన చావ్రా వి.ఐపి. నాయర్, విజయ లక్ష్మి దంపతులకు జన్మించారు. ఆమె ఇద్దరి సోదరిలు కళారంజని మరియు ఊర్వశి కూడా సినిమా నటులే. ఆమె ఇద్దరు సోదరులు స్వర్గీయ కమల్ రాయ్, స్వర్గీయ ప్రిన్స్ కూడా మళయాళ సినిమాలలో నటించినవారే. ఆమె 1998లో మలయాళ సినిమా దర్శకుడు అనిల్ కుమార్ ని వివాహం చేసుకొన్నారు. కానీ వారి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2012లో వారు విడిపోయారు. వారి ఏకైక కుమార్తె శ్రీమయి తల్లి వద్దే ఉంటూ చదువుకొంటోంది.
1977సం.లో బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించిన కల్పన సుమారు 250కి పైగా సినిమాలు చేసారు. ఆమె సహాయ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకొన్నారు. చివరిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగులో ‘ఊపిరి’ సినిమాలో చేయడానికి వచ్చినప్పుడు ఆమె తుది శ్వాస విడవడం చాలా బాధ కలిగిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ఆమె మరణవార్త విని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.