తెలుగుదేశం పార్టీ వైఖరిపై మండి పడింది అలనాటి హీరోయిన్ కవిత. తెలుగుతో పాటు దక్షిణాది లోని ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా నటించి.. తదుపరి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసిన కవిత కొన్నేళ్ల క్రితం తెలుగుదేశంలో చేరింది. ఆ పార్టీ తరపున క్రియాశీలంగా పనిచేసింది. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ, పార్టీ తరపున ప్రెస్ మీట్లలోనూ కవిత గట్టిగానే పాల్గొంది. 2009 ఎన్నికలకు ముందు.. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న కాలంలో ఆ పార్టీలో చేరింది. తొలుత బాగానే హడావుడి చేసింది కానీ.. ఆ తర్వాత మాత్రం ఈమె మిన్నకుండి పోయింది.
చాన్నళ్లుగా పొలిటికల్ వ్యవహారాల్లో కనిపించని కవిత తాజాగా హరిత హారంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ తీరుపై కవిత అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. తెలుగుదేశం పార్టీ తనను వాడుకుని వదిలేసిందని కవిత వ్యాఖ్యానించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తనకు తరచూ ఆదేశాలు జారీ చేసే వాళ్లని, ప్రెస్ మీట్లు పెట్టి.. అధికార పార్టీపై విరుచుకుపడాలని తనకు ఆదేశాలు జారీ అయ్యేవని.. తీరా తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా మాత్రం తనలాంటి వాళ్లను పట్టించుకునే వాళ్లు కరువయ్యారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ రకంగా తెలుగుదేశం పార్టీ తనను ఉపయోగించుకుని, తీరా అధికారం చేతికి అందాకా మాత్రం పట్టించుకోవడం మానేసిందని కవిత వ్యాఖ్యానించారు. మరి చాన్నాళ్లకు మీడియా ముందుకు వచ్చిన కవిత ఈ విధంగా వ్యాఖ్యానించారు. అది కూడా తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ కవిత ఈ వ్యాఖ్యానాలు చేశారు. దీని భావం.. ఈమె తెరాసకు దగ్గరవ్వడమేనా?