ఒకనాటి అందాల బాలీవుడ్ నటి సాధన ఈరోజు ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆమె వయసు 74 సం.లు. ఆమె గత కొన్నేళ్ళుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె 1941 సం.లో కరాచీలో జన్మించారు. ఆమె పూర్తి పేరు సాధన శివదాసాని. ఆమె 1955లోనే బాలనటిగా బాలీవుడ్ లో ప్రవేశించారు. 1955లో విడుదలయిన అలనాటి ప్రముఖ హీరో స్వర్గీయ రాజ్ కపూర్ నటించిన “శ్రీ 420” అనే హిందీ సినిమాలో ‘ముడ్ ముడ్కే నదేక్ ముడ్కే’ అనే పాటలో సాధన మొదటిసారిగా వెండితెరపై కనిపించింది. ఆ తరువాత 1958లో సింధీ బాషలో మొట్టమొదటి సినిమా ‘అబాన’ నటించారు. 1959 సం.లో “లవ్ ఇన్ సిమ్లా”తో బాలీవుడ్లో ప్రవేశించారు. అప్పటి నుండి మళ్ళీ వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం కలగలేదు.
ఆమె కేవలం 34 సినిమాలలో మాత్రమే నటించినా వాటిలో చాలా సినిమాలు సూపర్ హిట్లే. ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవే. ఆమె నటించిన సినిమాలలో ఫరక్, హం దోనో, ఏక ముసాఫిర్ ఏక హసీనా, దిల్ దౌలత్ దునియా, ఛోటే సర్కార్, మేరి మెహబూబ్, ఓహ్ కౌన్ తి?, దుల్హ దుల్హన్, వక్త్, మేరె సాయ, ఆర్జూ, ఏక ఫూల్ ధో మాలి, ఆప ఆయే బహార్ ఆయే వంటి అనేక సినిమాలు ఆమెకు నటనా ప్రతిభకు గుర్తింపుగా నిలిచిపోతాయి. ఆమె ఆఖరిగా చేసిన సినిమా 1991లో విడుదలయిన ఉల్ఫట్ కి నయీ మంజీలే. గీతా మేరే నామ్ అనే సినిమాలో ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా ఆ సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. ఆమె వృదాప్య సమస్యలతో ఎంతగా బాధపడుతున్నప్పటికీ ఎదయినా సినిమా కార్యక్రమానికి ఆహ్వానించినట్లయితే తప్పకుండా హాజరయ్యేవారు. ఆమెకు బాలీవుడ్ శ్రద్దాంజలి ఘటిస్తోంది.