“సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమంది అమ్మాయిలను తమ కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశారని అడిగితే… జయేంద్ర సర్ దగ్గరకు వెళ్లాము. కానీ, ఛాన్స్ దొరకలేదని అంటారు. ఆయన ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నారు. ఆయనతో ఎంతోమంది పని చేయాలని అనుకుంటారు. నాకు ఆ అవకాశం వచ్చింది. ఐ జస్ట్ ఫీల్ లక్కీ” అన్నారు తమన్నా. జయేంద్ర దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా నువ్వే’. అంత ఇష్టమైన దర్శకుడు కథ చెప్పడానికి వచ్చిన సమయంలో తమన్నా కళ్లు మూతలు పడ్డాయట. నిద్ర ముంచుకు వచ్చేసిందని చెప్పారామె. ఆ సందర్భం గురించి ఆమె మాట్లాడుతూ “జయేంద్రగారు తొలిసారి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను అమెరికా నుంచి అప్పుడే ఇండియా వచ్చాను. ఇరవై రెండు గంటలు ఫ్లైట్ జర్నీ చేశా. ఆయన కథ చెబుతుంటే నాకు నిద్ర వచ్చేస్తుంటుంది. కొన్ని సన్నివేశాల్లో నిద్ర వచ్చేసేది కూడా. కానీ, కథ వినేదాన్ని. ‘వావ్… భలే వుంది’ అనుకునేదాన్ని. అయితే పరిస్థితుల వల్ల కళ్లు మూతలు పడేవి” అని చెప్పారు. సినిమా బేసిక్ కథ నచ్చిందనీ, అదేంటో ఆడియో వేడుకలో చెప్పలేననీ తమన్నా పేర్కొన్నారు.