హీరోయిన్ల పారితోషికాల గురించీ, వాళ్ల ఎగస్ట్రా ఖర్చుల గురించీ ఎడతెగని చర్చ నడుస్తూనే ఉంటుంది. ఆమధ్య ఈ వాయింపు ఇంకా ఎక్కువైపోయింది. అయినా మన నిర్మాతలు మంచోళ్లు కాబట్టి భరిస్తూనే ఉన్నారు. టాప్ హీరోయిన్ పారితోషికం అనేసరికి 2 నుంచి 3 కోట్ల వరకూ చెల్లించుకోవాలి. అక్కడితో ఆగిపోవడం లేదు. సదరు హీరోయిన్ కి ఎగస్ట్రా పేమెంట్ల రూపంలో లక్షల్లో సమర్పించుకోవాల్సివస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఓ టాప్ హీరోయిన్ ఒక్కో సినిమాకీ రూ.3 కోట్ల వరకూ తీసుకొంటోంది. అది కాకుండా సినిమా అయ్యేలోపు తన ఖర్చంతో తెలుసా? అక్షరాలా… రూ.75 లక్షలు. ఇవి లెక్కల్లో లేని ఖర్చు. అంటే.. ఆ హీరోయిన్ మొత్తం పారితోషికం రూ3.75 కోట్లన్నమాట.
హీరోయిన్ తిండి కోసం రోజుకి పాతిక వేలు ఇచ్చుకోవాలంట. ఆమె వ్యక్తిగత సిబ్బందికీ నెలసరి వేతనాలు.. సదరు నిర్మాతల ఎకౌంట్లోంచే. ఇవి కాకుండా.. హీరోయిన్ చుట్టూ ఉండే రక్షక సిబ్బంది ఖర్చులు సైతం నిర్మాతలపైనే. వీళ్లందరికీ సెట్లో కార్వాన్లు తప్పనిసరి. ఓ హీరోయిన్ వస్తోంటే, నిర్మాత కనీసం హీరోయిన్ తరపున కనీసం పదిమందిని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు ఈ ఎగస్ట్రా బాదుడు భరించలేమని నిర్మాతలు గగ్గోలు చేసినా, క్రమేణా అలవాటు పడిపోయారు. గిల్డ్ మీటింగుల్లో ”మేం హీరోయిన్లకు పారితోషికాలే ఇస్తాం. ఆమె ఖర్చులు భరించలేం” అని చెప్పి, తీర్మానాలు చేసుకొన్నా, ఎవరికి వాళ్లు తాము రాసుకొన్న రూల్స్ ని తామే తుంగలోకి తొక్కేసి, హీరోయిన్ల సేవలతో తలమునకలైపోతున్నారు. హీరోయిన్లు కూడా ‘ఇలాగైతేనే సినిమా చేస్తాం’ అని ముందే షరతుల చిట్టా విప్పుతున్నారు. దాంతో.. తప్పని పరిస్థితి.
ఈమధ్య ఓ టాలీవుడ్ హీరోయిన్ మిగిలిన భాషా చిత్రాలపై ఫోకస్ పెట్టింది. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల సినిమాల్లో నటిస్తోంది. అక్కడా.. ఇంతటి పారితోషికమే. కానీ ఎగస్ట్రా బాదుడుకి అవకాశం లేదు. హీరోయిన్‌కి ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చేసి, చివర్లో ఆమె ఖర్చుల తాలుకా బిల్లు చేతిలో పెట్టార్ట. అవన్నీ చూసి హీరోయిన్ నిర్ఘాంతపోయిందట. ”మేం నీకు మాత్రమే పారితోషికం మాత్రమే ఇస్తాం.. నీ సిబ్బంది సంగతి నువ్వే చూసుకోవాలి” అని తెగేసి చెప్పార్ట. సదరు హీరోయిన్ సెట్లో, బయటా చేసిన ఎగస్ట్రా ఖర్చు ఎప్పటికప్పుడు, రోజు వారిగా లెక్కేసి, ఆ డబ్బుని సదరు హీరోయిన్ చేత ముక్కు పిండి మరీ వసూలు చేశార్ట.
మరో హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగింది. సెట్లో ఏం పెడితే అది తినాలి.. నీకు కావాలంటే కార్ వాన్ ఇస్తాం.. నీ సిబ్బంది సంగతి నువ్వే చూసుకో.. అని నిర్మొహమాటంగా చెప్పేశార్ట. అంతేకాదు…. ఏ రోజైనా హీరోయిన్ వల్ల షూటింగ్ ఆగిపోతే, దానికి నష్టపరిహారం కూడా చెల్లించాలని క్లాజు యాడ్ చేశార్ట. దాంతో… సదరు హీరోయిన్ కంగారు పడిపోయింది. ”మా టాలీవుడ్ లోనే బెస్టు.. అక్కడ ఇలాంటివేం లేవు” అని తన సన్నిహితులతో చెబుతోందట. మన నిర్మాతలు మరీ మెతక. ఇలాంటి విషయాల్లో చూసీ చూడనట్టు వదిలేస్తుంటారు. దాన్ని హీరోయిన్లు కూడా అలుసుగా తీసుకొంటుంటారు. మెత్తగా ఉంటేనే కదా, మొత్తబుద్ధేస్తుంది. ఈ విషయంలో మన నిర్మాతలైనా మారాలి. లేదంటే… హీరోయిన్లనాయినా పెద్ద మనసు చేసుకొని వ్యవహరించాలి.