ఈతరం హీరోయిన్లలో అందరూ బాగా డాన్స్ చేస్తున్నవాళ్లే. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులు వేస్తున్నారు. డాన్సుల్లో నిన్నా మొన్నటి వరకూ తమన్నా అగ్ర స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ ప్లేసుని.. సాయి పల్లవి ఆక్రమించుకుంది. సాయి పల్లవి డాన్సుల్లో ఈజ్, గ్రేస్.. చూసి హీరోలే ముచ్చటపడిపోతున్నారు. సారంగ దరియా.. పాటైతే… సాయి పల్లవి డాన్స్ ప్రతిభకు నిలువుటద్దంలా నిలిచింది. సాయిపల్లవి స్టెప్పుల కోసమే ఆ సినిమాని చూసినవాళ్లు ఎంతోమంది. యూ ట్యూబ్ లో కూడా ఈ పాట రికార్డు వ్యూస్ సంపాదించుకుంది. సాయి పల్లవి క్రేజ్‌ని ఇంకో మెట్టు ఎక్కించిన పాట ఇది.
అందుకే ఈ తరహా పాటలపై… మిగిలిన హీరోయిన్లు కూడా దృష్టి పెడుతున్నారు. ఇటీవల ఓ టాప్ హీరోయిన్ దగ్గరకు కథ చెప్పడానికి దర్శకుడు వెళ్తే.. `స్టోరీ బాగుంది. నా క్యారెక్టర్ కూడా బాగుంది. ఈ సినిమాలో.. సారంగ దరియాలాంటి పాటైదైనా పెట్టండి.. సోలోగా నేనొక్కదాన్నే స్టెప్పులు వేసేలా ఉండాలి` అని సదరు హీరోయిన్ దర్శకుడ్ని అడిగిందట. ఇలాంటి కోరికే మరో హీరోయిన్ కూడా బయటపెట్టిందని టాక్. రష్మిక, కృతి శెట్టి, కీర్తి.. వీళ్లంతా మంచి డాన్సర్లే. కానీ స్టెప్పులు వేసేంత సందర్భాలు ఇంకా వాళ్ల కెరీర్లో రాలేదు. అందుకే ఇలా రిఫరెన్సులు చెప్పి మరీ… దర్శకులతో పాటల్ని సెట్ చేసుకుంటున్నారేమో..? ఇది వరకు హీరోల దగ్గర్నుంచి ఇలాంటి డిమాండ్లు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు హీరోయిన్లూ అడిగేస్తున్నారు. కాల మహిమ.