కరోనా వల్ల చిత్రసీమ పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగులు లేవు. దమ్మిడీ ఆదాయం లేదు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు. అయితే సినిమాలు, లేదంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, రెండూ లేవంటే మోడలింగ్ అంటూ రెండు చేతులా సంపాదించుకునేవాళ్లు. ఇప్పుడు ఆ రెండూ లేవు. భవిష్యత్తులో మరిన్ని గండాలు వాళ్లని వెదుక్కుంటూ రాబోతున్నాయి.
మే లోనో, జూన్ లోనో… అంతగా కాకపోతే జులైలోనో షూటింగులు మొదలవ్వడం ఖాయం. కాస్త అటూ ఇటూ అంతే. షూటింగులు ఎప్పుడు మొదలైనా ఒక్కసారిగా, హీరోయిన్లపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఒకొక్క అగ్ర హీరోయిన్ చేతిలోనూ రెండు మూడు సినిమాలున్నాయి. ఒక్కసారిగా ఆ మూడు సినిమాలకూ కాల్షీట్లు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంత మేర షూటింగ్ జరుపుకున్న సినిమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. దాంతో.. ఎగ్రిమెంట్లు కుదుర్చుకుని, షూటింగ్ మొదలవ్వాల్సిన సినిమాల్ని వదులుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. షూటింగ్ త్వరగా మొదలెట్టి, త్వరగా పూర్తి చేయాలన్న తొందర అందరిలోనూ ఉంటుంది. దాంతో అందుబాటులో ఉన్న హీరోయిన్లతో సర్దుకోవడం మొదలెడతారు. దానివల్ల కొత్త హీరోయిన్లకు ఛాన్సు దొరుకుతుంది. అవకాశాలు లేక ఖాళీగా ఉన్న మాజీ హీరోయిన్లకు అవకాశం లభిస్తుంది. కానీ ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు మాత్రం కొన్ని సినిమాల్ని ఇష్టం లేకపోయినా వదులుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. చేతిలో ఉన్న పెద్ద సినిమాలు జారిపోతాయేమో అన్నది హీరోయిన్ల భయం. వీలైనంత వరకూ పెద్ద సినిమాల్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. దాంతో చిన్న, మీడియం సైజు సినిమాల్లో హీరోయిన్ల మార్పు తప్పనిసరైంది. ఎవరి ఎవరి స్థానంలో ఎవరొస్తారో చూడాలి.