పారితోషికం పేరుతో కొండెక్కేయడం… హీరోయిన్లకే సాధ్యం. హీరోలైనా.. `దర్శకుడు మనోడే కదా… సినిమా మనదే కదా` అని ఆలోచిస్తారేమో..? హీరోయిన్లు అలాకాదు. చేతిలో ఒక్క హిట్టుంటే చాలు. కోట్లకు పడగలెత్తేస్తారు. ఆ తరవాత వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట. స్టార్ హీరోయిన్ల గురించి ఇక చెప్పేదేముంది? ఈమధ్య వాళ్ల డిమాండ్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమ వ్యక్తిగత సిబ్బంది జీత భత్యాలు, వాళ్ల దైనందిన ఖర్చులు, వసతి… అన్నీ నిర్మాత ఎకౌంట్లోంచే బాదేస్తున్నారు. ఈమధ్య ఓ హీరోయిన్ సెట్ కి బౌన్సర్లతో రావడం, వాళ్ల జీతాలు కూడా నిర్మాతనే చెల్లించమనడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు ఈ బాదుడు కార్యక్రమం కొత్త రూపంలోకి వెళ్తోంది.
ప్రతీ సినిమాకీ… ఓ కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు. వాళ్లే… అందరికీ కావల్సిన కాస్ట్యూమ్స్ నిడిజైన్ చేస్తారు. అయితే ఇప్పుడు తమకంటూ ఓ స్థాయి వచ్చిన హీరోయిన్లు వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్లని నియమించుకుంటున్నారు. సినిమా ఏదైనా సరే… కాస్ట్యూమ్స్ ని వాళ్లే డిజైన్ చేయించుకుంటారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ.. వాళ్లు వేసిందే డ్రస్సు.. ఇచ్చిందే బిల్లు. `ఈ డ్రస్ కి ఇంత ఖర్చు అవుతుందా.. ` అని అడగడానికి వీల్లేదు.
ఇటీవల ఓ సినిమా కోసం స్టార్ హీరోయిన్ ని ఐటెమ్ గాళ్ గా తీసుకొన్నారు. ఆ పాటకు గానూ దాదాపు 70 లక్షల పారితోషికం ఇచ్చారు. అయితే కాస్ట్యూమ్స్‌కి అదనం. వాటికి ఏకంగా 19 లక్షల బిల్లు వేసింది ఆ హీరోయిన్. ఇంతకీ మార్చింది మూడో, నాలుగో..? అంటే… ఒక్కో కాస్ట్యూమ్ కీ దాదాపుగా 5 లక్షలన్నమాట. ఇదే కాస్ట్యూమ్స్ ని సినిమాకి పని చేసిన డిజైనర్‌తో చేయించుకుంటే మూడు లక్షల్లో తేలిపోయేది. అంటే అదనంగా.. 16 లక్షలు అయ్యిందన్నమాట. ఇదంతా ఎవరు తిన్నట్టు? దాదాపు ప్రతీ హీరోయిన్ కీ వ్యక్తిగత కాస్ట్యూమర్స్ ఉన్నారు. వాళ్ల జీతం కూడా నిర్మాతే ఇవ్వాలి. ఇవి కాకుండా పైకి కనిపించని ఖర్చులు చాలానే ఉంటాయి. అవన్నీ నిర్మాతలే భరించాల్సివస్తోంది.