ఓ సినిమాకి హీరో ఎవరు, హీరోయిన్ల ఎంపిక అనేది కథ డిమాండ్ చేసిన మేరకే జరుగుతుంది. సాధారణంగా హీరోని ఎంచుకొన్న తరవాత… ఆయన పక్కన హీరోయిన్ ఎవరైతే బాగుంటారు? అనేది ఆలోచిస్తారు. దర్శకుడు, నిర్మాతలు కిందా మీద పడీ హీరోయిన్ని సెట్ చేస్తుంటారు. ఇదే అసలు పద్ధతి.
కానీ.. ఓ హీరో ఉన్నాడు. ఆయనతో సినిమా అంటే.. ఎవరిని పడితే వాళ్లని హీరోయిన్గా తీసుకోవడం కుదర్దు. అసలు హీరోయిన్ల ఎంపిక దర్శకుడు, నిర్మాత చేతుల్లో లేకుండా పోతుంది. హీరో చేతిలో అడ్వాన్సు పడగానే, కనీసం కథ కూడా వినకుండా.. `ఫలానా హీరోయిన్ కావాలి..` అని హీరోగానే చెబుతారు. ఆకాశం కిందపడి, భూమి బద్దలైనా సరే, ఆ హీరోయిన్నే తీసుకురావాల్సిందే.
సదరు హీరోగారి దగ్గర ఓ చెక్ లిస్టు ఉంటుందట. అందులో హీరోయిన్ల వివరాలన్నీ ఉంటాయి. `ఆ హీరోయిన్‌పై నాకు క్రష్ ఉంది… తననే ఈసారి ఎంచుకోండి..` అని హీరోగారు మొహమాటం లేకుండా… దర్శక, నిర్మాతలకు ఆదేశాలు జారీ చేస్తుంటార్ట. ఇక చేసేదేం లేక… ఆమెనే వెదికి తీసుకొస్తుంటార్ట. ఇదీ.. హీరో గారి సినిమాలకు హీరోయిన్లకు ఎంపిక చేసే పద్ధతి. ఇటీవల ఈ హీరో ఓ సినిమా ఏశాడు. అందులో ఇద్దరు హీరోయిన్లున్నారు. ఇద్దరూ ఊరూ, పేరూ లేనివాళ్లే. కాకపోతే… వాళ్లతో చేయాలని హీరో తెగ తాపత్రయపడిపోవడం వల్ల వాళ్లనే తీసుకోవాల్సివచ్చింది. ఇప్పుడు మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అందులోనూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వాళ్లతో హీరో కెమిస్ట్రీ ఏమాత్రం కుదర్లేదని ట్రైలర్లు, టీజర్లు, పాటల ప్రోమోలూ చూస్తూనే అర్థమవుతోంది. ఈసారి కూడా హీరోయిన్లని ఎంపిక చేసే ఛాయిస్.. హీరోగారిదేనట. మరి ఈ హీరోకి ఇదేం పైత్యమో..?!